కుడుపూడి రాఘవమ్మ కన్నుమూత

  • అస్వస్థతతో మృతి – పలువురి సంతాపం

ప్రజాశక్తి – అమలాపురం(డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా) : కూలి పోరాటాల ధ్రువతార కుడిపూడి రాఘవమ్మ (78) కన్నుమూశారు. మంగళవారం మధ్యాహ్నం డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా తొత్తరమూడిలోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. ఆమె భర్త కుడిపూడి నరసింహమూర్తి ఉపాధ్యాయుడిగా, సిపిఎంలో సభ్యునిగా పనిచేశారు. ఆయన ప్రోత్సాహంతో రాఘవమ్మ పోరాటాల బాట పట్టారు. భర్త చనిపోయినా పోరాటాలను వీడలేదు. ఆమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బుధవారం ఉదయం తొత్తరమూడిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

రాఘవమ్మ మరణానికి వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌, అండ్ర మాల్యాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు తదితరులు సంతాపం తెలిపారు.
సిపిఎం తరుపున కోనసీమలో జరిగిన పలు పోరాటాల్లో రాఘవమ్మ ముఖ్యభూమిక వహించారు. ముఖ్యంగా 1990వ దశాబ్దంలో కోనసీమలో జరిగిన కూలి పోరాటాలు, భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో ఆమె కీలక పాత్ర పోషించారు. రామచంద్రపురం, వెంకటాయపాలెంలో దళితులకు తోట త్రిమూర్తులు శిరోముండనం చేసిన ఘటన నేపథ్యంలో జరిగిన పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. సారా వ్యతిరేక ఉద్యమానికి కోనసీమలో నాయకత్వం వహించారు. సిపిఎం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ సభ్యులుగా చాలాకాలం సేవలందించారు. ఐద్వా జిల్లా అధ్యక్షులుగా, వ్యవసాయ కార్మిక సంఘానికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులుగా పని చేశారు. ప్రస్తుతం డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షురాలిగా, రాష్ట్ర కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నారు.

➡️