ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రొపెసర్ చెంగయ్యపై మత ప్రచారం నెపంతో దాడి చేయడాన్ని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర కమిటి ఖండించింది. మతోన్మాద, సంఘ వ్యతిరేక శక్తులు విశ్వవిద్యాలయంలో చెంగయ్య ఛాంబర్‌లోకి ప్రవేశించి దుర్భాషలాడి, భౌతికదాడికి పాల్పడినట్లు కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఒ.నల్లప్ప, ఆండ్ర మాల్యాద్రి గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. చెంగయ్య వాహనాన్ని కూడా దుండగులు ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
