ప్రజాశక్తి – కలెక్టరేట్ (విశాఖపట్నం) : తక్షణమే జిఒ 596ను రద్దు చేసి దళితుల భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ కెవిపిఎస్ ఆధ్వర్యంలో సోమవారం విశాఖలోని ఎల్‌ఐసి కార్యాలయం సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుకోటి చిరంజీవి, జిల్లా ఉపాధ్యక్షులు వై.రాజు మాట్లాడుతూ.. దళితుల భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరారు. దళిత, గిరిజన గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. స్వయం ఉపాధి అవకాశాలను మెరుగు పరచాలని విజ్ఞప్తి చేశారు. దళితులకు చెందిన 28 పథకాలను గత ప్రభుత్వం నిలిపివేసిందని, వాటిని కొత్త ప్రభుత్వం పునరుద్ధరించాలని కోరారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్ ప్లాన్ నిధులను సక్రమంగా ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఆ నిధులను జనరల్ పథకాలకు గతంలో మళ్లించి దళితులకు అన్యాయం చేశారని విమర్శించారు. దళితులకు విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం వంటివి అమలు చేయాలని, కులాంతర వివాహాలకు ప్రోత్సాహం అందివ్వాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఎం.సుబ్బారావు, కె.శేఖర్, కె.నర్సింగరావు, ఇమాన్యుయల్, సరోజిని పాల్గొన్నారు.
