ప్రణాళిక, ఆత్మవిశ్వాసంతో పోటీ పరీక్షల్లో విజయం

Dec 2,2023 21:53 #KVPS, #PDF MLC, #Service Sector
kvps free group 2 material distribution
  •  గ్రూప్‌-2 స్టడీ మెటీరియల్‌ పంపిణీలో వక్తలు

ప్రజాశక్తి – ఎడ్యుకేషన్‌ (విజయవాడ): కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం సులభమని, తద్వారా ప్రజలకు సేవ చేసే చక్కటి అవకాశం లభిస్తుందని పలువురు వక్తలు అన్నారు. ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు రచించిన గ్రూప్‌ -2 స్టడీ మెటీరియల్‌ పంపిణీ కార్యక్రమం విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఫూలే అంబేద్కర్‌ విజ్ఞాన కేంద్రం, కెవిపిఎస్‌ ఆధ్వర్యాన శనివారం జరిగింది. స్టడీ మెటీరియల్‌ను సివిల్‌ సప్లరు మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.వీరపాండియన్‌, విజయవాడ సౌత్‌జోన్‌ ఎసిపి డాక్టర్‌ బి.రవికిరణ్‌, ఫూలే అంబేద్కర్‌ విజ్ఞాన కేంద్రం ఛారిటబుల్‌ ట్రస్టు కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ ఇటీవల కాలంలో పోటీ పరీక్షలు రాసే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. పోటీ ఏ స్థాయిలో ఉన్నా ప్రణాళికాబద్ధంగా పరీక్షలు రాస్తే మంచి మార్కులు పొంది ఉద్యోగం సాధించవచ్చని తెలిపారు. సివిల్‌ సప్లమ్‌ ఎండి వీరపాండ్యన్‌ మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు స్థిరమైన లక్ష్యాలు ఉండాలన్నారు. రకరకాల పుస్తకాలు చదవడం కంటే ఒకే పుస్తకాన్ని ఎక్కువసార్లు చదవడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుందని తెలిపారు. ఎసిపి రవి కిరణ్‌ మాట్లాడుతూ.. గ్రూప్‌ -1లో 12వ ర్యాంకు సాధించేందుకు తాను చదివిన పుస్తకాలను విద్యార్థులు ఎలా చదవాలో కూలంకుషంగా వివరించారు. ఫూలే అంబేద్కర్‌ విజ్ఞానకేంద్రం ఛారిటబుల్‌ ట్రస్టు కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని పెద్దఎత్తున చేపట్టాలని కోరారు. తద్వారా నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. జిఆర్‌కె పోలవరపు కళాసమితి అధ్యక్షులు గోళ్ల నారాయణరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి, పూలే అంబేద్కర్‌ విజ్ఞాన కేంద్రం ఛారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ అండ్ర మాల్యాద్రి, సిద్ధార్థ ఐఎఎస్‌ అకాడమీ చైర్మన్‌ మన్నం రాజారావు, మ్యాథ్స్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎస్‌.లెనిన్‌బాబు, కెవిపిఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి జి.నటరాజు, సుమలత తదితరులు పాల్గొన్నారు.

➡️