జ్యోతిరావు పూలేకు కెవిపిఎస్‌ ఘన నివాళి

Apr 11,2025 21:42 #KVPS, #pule

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : చదువుతోనే అంటరానితనం, కుల వివక్ష నిర్మూలన సాధ్యమవుతుందని గుర్తించిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి అన్నారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా విజయవాడలోని క్షేత్రయ్య కళాక్షేత్రం వద్ద ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు వేసి శుక్రవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అందరికీ చదువు నేర్పించి కుల వివక్ష నిర్మూలించడానికి తన జీవితాంతం కృషి చేశారని తెలిపారు. నిమ్న కులాలు, మహిళల హక్కుల కోసం తన జీవితాంతం పోరాటం చేశారని, మహిళలకు విద్య నిషేదం ఉన్న రోజుల్లోనే బాలికలకు పాఠశాలలను ఏర్పాటు చేశారన్నారు. వితంతువులకు పునర్వివాహాలు జరిపించిన సంఘ సంస్కర్త అని తెలిపారు. కుల రహిత సమాజం కోరుకున్న మహనీయుడని చెప్పారు. దేశంలో ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను అమలు జరుపుతూ సనాతన ధర్మం పేరుతో ప్రజలపైన మనుధర్మాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పూలేకు నివాళులర్పించిన వారిలో సంఘం ఉపాధ్యక్షులు జి.నటరాజ్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కంభం ప్రసన్న కుమార్‌, ఎ.అశోక్‌, రామ్మోహనరావు, దళిత జాగృతి వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసాని గణేష్‌ బాబు, కనకరాజు, అనిల్‌ కుమార్‌, సామాజిక కార్యకర్త చౌడికి కృష్ణ, పిఆర్పిఎస్‌ జాతీయ నాయకులు జైబాబు, ఎమ్మార్పిఎస్‌ నాయకులు ఏసు కెవిపిఎస్‌ నాయకులు జి.అమృతరావు తదితరులు ఉన్నారు.

➡️