లేబర్‌ కోడ్స్‌ రద్దుకు 5న కార్మిక ప్రదర్శన

Feb 1,2025 07:35 #Labour Codes, #workers protest

సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌

ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్‌ : కేంద్రంలోని బిజెపి అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా అఖిలపక్ష కేంద్ర కార్మిక సంఘాలు ఈ నెల 5వ తేదీన భారీ నిరసన ప్రదర్శన చేపట్టాలని పిలుపునిచ్చాయని సిఐటి యు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ తెలిపారు. ఆ పిలుపులో భాగంగా 5వ తేదీన జిల్లాలో పెద్ద ఎత్తున కార్మికులు నిరసన ప్రదర్శనలో పాల్గొవాలని విజ్ఞప్తి చేశారు. జగదాంబ సమీపంలోని సిఐటియు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్పొరేట్‌ ప్రయోజనాలకు అనుకూలంగా కార్మిక చట్టాలను మార్చాలని ప్రయత్నిస్తుందన్నారు. అందులో భాగంగానే కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను 4 లేబర్‌ కోడ్స్‌గా మార్పు చేసిందన్నారు. ఈ కోడ్స్‌ అమలు జరిగితే కార్మికులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. సంఘం పెట్టుకొని హక్కు, సమ్మె చేసే హక్కు, యజమానులతో జీతభత్యాలు బేరం ఆడే హక్కు వంటివి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ లేబర్‌ కోడ్స్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేసే మానిటైజేషన్‌ ఆఫ్‌ పైప్‌ లైన్‌ రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని, కనీస పెన్షన్‌ రూ.9 వేలకు తక్కువ లేకుండా చెల్లించాలని తదితర డిమాండ్లతో దేశవ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ ఈ ప్రదర్శనకు పిలుపునిచ్చాయని తెలిపారు. విశాఖలో ఈ నెల 5వ తేదీ ఉదయం 9 గంటలకు జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద జరగనున్న నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొనాలని పిలుపునిచ్చారు. అన్ని పరిశ్రమల వద్ద, కార్మికుల పని ప్రదేశాలలోనూ నిరసనలు తెలపాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పబ్లిక్‌ సెక్టర్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ కో-కన్వీనర్‌ ఎస్‌.జ్యోతీశ్వరావు, జివిఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి ఉరుకూటి రాజు, మోటార్‌ ట్రాన్స్‌పోర్టు యూనియన్‌ ప్రధాన కార్యదర్శి జి.అప్పలరాజు పాల్గొన్నారు.

➡️