- రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాల ఆందోళనలు
- దేశ వ్యాప్తంగా మార్చి 18 నుంచి నిరవధిక సమ్మె : హేమలత
ప్రజాశక్తి – యంత్రాంగం : కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు చేపట్టారు. పలుచోట్ల లేబర్ కోడ్‌ల ప్రతులను దహనం చేశారు. నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి నేటి వరకు ప్రజా, కార్మిక, రైతు సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్లకు మేలు చేసేందుకే అనునిత్యం తపన పడుతున్నారని పలువురు నాయకులు విమర్శించారు. కార్మిక, రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు.
తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో ‘కార్మిక వర్గానికి శాపం- లేబర్ కోడ్ అమలు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో సిఐటియు అఖిల భారత అధ్యక్షులు హేమలత మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చి కార్మిక వర్గానికి ద్రోహం చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కార్మిక వర్గానికి ఉన్న కొద్దిపాటి హక్కులను కుదించడమే లేబర్ కోడ్‌ల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. దీనిపై కార్మికులు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో లేబర్ కోడ్‌ల అమలుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వచ్చే నెల 18 నుంచి నిరవదిక సమ్మె నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడ హనుమాన్‌పేటలో జరిగిన నిరసన కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు, ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు కె.రవీంద్రనాథ్ మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న హక్కులు, చట్టాలను నిర్వీర్యం చేస్తోందని తెలిపారు. ఏకపక్షంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లను రద్దు చేసే వరకూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆందోళనలో ఐఎఫ్‌టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, టియుసిఐ రాష్ట్ర అధ్యక్షులు మరీదు ప్రసాద్‌బాబు, ఎఐయుటియుసి రాష్ట్ర అధ్యక్షులు కె.సుధీర్, సిఐటియు రాష్ట్ర నాయకులు కె.ధనలక్ష్మి, కె.సుబ్బరావమ్మ, ఆర్.వి.నరసింహారావు, కెఆర్‌కె.మూర్తి పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని కెఎన్ రోడ్డులో బహిరంగ సభ, అనంతరం పోలీసు ఐల్యాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం, నరసాపురం, కుక్కునూరు, చింతలపూడి మండలాల్లో నిరసనలు తెలిపారు. విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం సమీపాన అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యాన నిరసన తెలిపారు. తొలుత జివిఎంసి గాంధీ విగ్రహం నుంచి ఆర్‌టిసి కాంప్లెక్స్ ఫ్లైఓవర్ వరకు, తిరిగి అక్కడి నుంచి జివిఎంసి గాంధీ విగ్రహం వరకూ ప్రదర్శన చేపట్టారు. అనంతరం లేబర్ కోడ్స్, కేంద్ర బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలైన స్టీల్‌ప్లాంట్, భెల్, షిప్‌యార్డు, హెచ్‌పిసిఎల్ కంపెనీల గేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు సాగాయి. అనకాపల్లి జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. అల్లూరి జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేశారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కృష్ణా, తిరుపతి, చిత్తూరు, తూర్పు గోదావరి, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేశారు.