శ్రమే అన్నింటికీ మూలం

  • ప్రముఖ సినీ కవి సుద్దాల అశోక్‌ తేజ

ప్రజాశక్తి-విజయవాడ : శ్రమే అన్నింటికీ మూలమని..శ్రమ వల్లే ఉత్పత్తి, సంపద వస్తుందని ప్రముఖ సినీ కవి డాక్టర్‌ సుద్దాల అశోక్‌ తేజ అన్నారు. ప్రముఖ సినీ కవి, జాతీయ అవార్డు గ్రహిత డాక్టర్‌ సుద్దాల అశోక్‌ తేజ రాసిన ‘శ్రమకావ్యం’ గానం కార్యక్రమం జాషువా సంస్కతిక వేదిక ఆధ్వర్యంలో విజయవాడలోని ఎంబివికె ఆడిటోరియంలో శుక్రవారం జరిగింది. జాషువా వేదిక అధ్యక్షులు సునీల్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లో ఇది తన 56వ శ్రమకావ్యమని అన్నారు. 56 అక్షరాల తెలుగు భాష దినోత్సవం, అదే సమయంలో తన 56వ గానం సంతోషంగా ఉందని తెలిపారు. చరిత్ర మొత్తం శ్రమతోనే నిండి ఉందన్నారు. పౌరాణిక ప్రతీకలను వాడుకొని ఈ గేయాన్ని రాశానని చెప్పారు. ‘శ్రమ ప్రయాణమే శ్రమాయణం.. విష్ణువు పెట్టుకున్న కిరీటం కూడా శ్రమ జీవి తయారు చేసింది. శ్రముడు, శ్రమి కలిసి సాగిన ప్రస్థానం ఈ శ్రమ కావ్యం’ అన్నారు. శారీరక శ్రమ నుండే నృత్యం, గానం పుట్టాయన్నారు. క్రైస్తవం, ముస్లిం, హిందూ మతాల కంటే ముందే ఏర్పడిన ఏకైక మతం శ్రామిక మతమన్నారు. రామాయణం, శివాయనం కన్నా ముందు నుండే శ్రమ ఉందని తెలిపారు. విశ్వరూపమే మహారూపం అయితే శ్రమ అంతకన్నా పెద్ద విశ్వరూపమని పేర్కొన్నారు. ఆది మానవుల నుండి మొదట పాట… ఆ తరువాతే మాట వచ్చిందన్నారు. సమాజ పురోగమనంలో శ్రమ విలువ వెలకట్టలేనిది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబివికె కార్యదర్శి పి.మురళీకృష్ణ, జాషువా సాంస్కతిక వేదిక కార్యదర్శి గుండు నారాయణరావు, ఎంబివికె బాధ్యులు కె.స్వరూపరాణి పాల్గొన్నారు. ముందుగా ప్రజానాట్యమండలి సీనియర్‌ నాయకులు జగన్‌, పిఎన్‌ఎమ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ అనిల్‌, అనిఫ్‌, అప్పన్న, చంద్ర నాయక్‌ శ్రమ విలువ, గొప్పతనంపై గేయాలు ఆలపించారు.

➡️