ప్రజాశక్తి-అంబాజీపేట (కోనసీమ జిల్లా) :తనపై పేటిఎం బ్యాచ్ చేసిన ఆరోపణలు నిరూపిస్తే వెంటనే మంత్రికి శాసన సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్ధమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సవాల్ విసిరారు. కోనసీమ జిల్లా అంబాజీపేటలో ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్‌లో గంజాయి సప్లై చేసేవాళ్లు పట్టుబడితే తన అనుచరులంటూ ఒక పత్రిక, చానెల్‌లో ఆరోపిస్తున్న తీరుపై ధ్వజమెత్తారు. గంజాయి సప్లై చేసేవాళ్లు, అమ్మేవాళ్లు వివరాలు తెలిపితే వాళ్ల వివరాలు గోప్యంగా ఉంచి ప్రభుత్వంతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా రూ.5 వేలు పారితోషం ఇస్తానని ప్రకటించారు. మాదకద్రవ్యాలు వల్ల యువత చెడు వ్యసనాలకు బానిసలై, తమ భవిష్యత్తును పాడు చేసుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తానని భరోసా కల్పించారు. సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ల నేతత్వంలో సంక్షేమ అభివద్ధి కార్యక్రమాలలో భాగస్వాములై ప్రోత్సహిం చాలని ఆయన కోరారు. సమావేశంలో పి.గన్నవరం ఎంఎల్‌ఎ గిడ్డి సత్య నారాయణ, మాచవరం సర్పంచ్ నాగాబత్తుల శాంతకుమారి, జనసేన ఉపాధ్యక్షులు శిరిగినీడి వెంకటేశ్వరరావు, వాసంశెట్టి కుమార్, బంతు పెదబాబు, అరిగెల సూరిబాబు, వాసంశెట్టి చినబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
