ప్రసవ వేదన

Jan 11,2025 00:52 #dolly motas, #get moksha, #tribals
  • డోలీలో గిరిజన గర్భిణి
  • మార్గం మధ్యలో డెలివరీ

ప్రజాశక్తి- శృంగవరపుకోట (విజయనగరం జిల్లా) : ప్రపంచమంతా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఎఐ) గురించి మాట్లాడుకుంటోంది. చంద్రుడిపైనా మన దేశం ఎప్పుడో కాలుమోపింది. ప్రస్తుత కంప్యూటర్‌ యుగంలో అసాధ్యాలెన్నో సుసాధ్యమవుతున్నాయి. అయినా, పాలకుల పుణ్యమా! అని గిరిజనానికి డోలీ మోతలకు మోక్షం లభించడం లేదు. ‘అమ్మ’తనానికి ఎంతో వేదన తప్పడం లేదు. అలాంటి సంఘటనే విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. శృంగవరపుకోట పంచాయతీ రేగపుణ్యగిరి గ్రామానికి చెందిన సీదరి శాంతికి గురువారం రాత్రి 11 సమయంలో పురిటి నొప్పులు వచ్చాయి. ఎస్‌.కోట పట్టణ కేంద్రానికి తొమ్మిది కిలోమీటర్ల దూరం కొండలపై ఉన్న ఆ గ్రామానికి రహదారి సౌకర్యం లేదు. శాంతి భర్త శివ తోటి గిరిజనుల సాయంతో డోలి కట్టి, రాత్రి ఒంటిగంట సమయానికి పుణ్యగిరి దేవస్థానం టికెట్‌ కౌంటర్‌ వద్దకు ఆమెను తీసుకొచ్చారు. శాంతికి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో మరో గిరిజన మహిళ డెలివరీ చేయించింది. 2.30 గంటల సమయంలో 108 వాహనం రావడంతో అందులో శృంగవరపుకోట ఏరియా ఆస్పత్రికి తల్లి, బిడ్డను తరలించారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

➡️