కార్మికపక్షపాతి నండూరి

  • వర్థంతి సభలో పలువురు వక్తలు

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :  కార్మికవర్గ పక్షపాతి నండూరి ప్రసాదరావు అని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, సిఐటియు రాష్ట్ర నాయకులు ఎం.జగ్గునాయుడు, పూర్వ ఉపాధ్యక్షులు ఎ.అజశర్మ కొనియాడారు. విశాఖలోని జగదాంబ దరి సిఐటియు జిల్లా కార్యాలయంలో నండూరి ప్రసాదరావు 23వ వర్థంతి కార్యక్రమం సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నండూరి ప్రసాదరావు విశాఖ జిల్లా కార్మికవర్గ సమస్యలను పరిష్కరించడంలో కీలకపాత్ర పోషించారన్నారు. సిఐటియు ఏర్పాటు కాకముందే కార్మికుల సమస్యలను అధ్యయనం చేయడంలో దిట్టగా పేరుగాంచారని తెలిపారు. షిప్‌యార్డులో నాడు ఐఎన్‌టియుసి మూడు సున్నాల అగ్రిమెంట్‌ చేసి కార్మికులకు ద్రోహం చేస్తే.. దానిని కార్మికులంతా తిరస్కరించే విధంగా కార్మిక వర్గాన్ని ఐక్యపరిచి అగ్రిమెంట్‌ను రద్దు చేయించారని, మెరుగైన వేతన అగ్రిమెంట్‌ చేయించడంలో కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. జూట్‌మిల్లుల్లో పని చేసిన కార్మికుల సమస్యలపైనా, రక్షణ రంగం, బిహెచ్‌పివి, జింక్‌ పరిశ్రమల కార్మికులు, ఇతర అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపైనా అనేక పోరాటాలు చేశారన్నారు. ఆయన వేసిన పునాది వల్లే నేడు విశాఖలో సిఐటియు బలంగా ఉందని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నండూరి ప్రత్యక్షంగా పాల్గొన్నారన్నారు. బాలలకు సంఘాలను ఏర్పాటు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపారని, వ్యవసాయ రంగంపై దృష్టిపెట్టి పని చేశారని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కెఎం.శ్రీనివాసరావు, పబ్లిక్‌ సెక్టార్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ కో – కన్వీనర్‌ కెఎం.కుమార్‌ మంగళం, సిఐటియు జిల్లా కార్యదర్శి బి.జగన్‌, ఎం.సుబ్బారావు, జి.పోలేశ్వరరావు, బాబూరావు పాల్గొన్నారు.

➡️