కార్మిక విజయం

  • దిగొచ్చిన విశాఖ ఉక్కు యాజమాన్యం
  • లేబర్‌ కమిషనర్‌ సమక్షంలో ఒప్పందం

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : ఐక్యంగా పోరాడిన విశాఖ ఉక్కు కార్మికులు కీలక విజయం సాధించారు. ప్రైవేటీకరణలో భాగంగా కాంట్రాక్టు కార్మికులను భారీగా తగ్గించడానికి యాజమాన్యం చేసిన కుట్రను అడ్డుకున్నారు. వేలాదిమంది కాంట్రాక్టు సిబ్బందితో పాటు రెగ్యులర్‌ కార్మికులు రెండు రోజుల పాటు కదం తొక్కారు. వీరికి మద్దతుగా వివిధ కార్మిక, ప్రజా సంఘాలు కదిలాయి. కార్మికుల నినాదాలు, ఆందోళనలు, రాస్తారోకోలతో బుధవారం ఉక్కు నగరం మారుమ్రోగింది. వీరిని అదుపుచేయడానికి పోలీసుల సహాయంతో యాజమాన్యం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆందోళన మరింత తీవ్రమయ్యే సంకేతాలు కనిపించడంతో యాజమాన్యం బుధవారం సాయంత్రం దిగివచ్చింది. కార్మిక సంఘాలతో చర్చలకు సిద్ధపడింది. ‘ఎవరినీ తొలగించం. అందరినీ విధుల్లో కొనసాగిస్తాం’ అని లేబర్‌ కమిషనర్‌ సమక్షంలో రాతపూర్వకంగా ఒప్పుకుంది. దీంతో కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇదే స్ఫూర్తితో ప్రైవేటీకరణను అడ్డుకుంటామని, సెయిల్‌లో విలీనాన్ని సాధిస్తామని కార్మికసంఘాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రకటించాయి.

దిగొచ్చిన యాజమాన్యం …
కార్మికుల ఆందోళనలు పెద్దఎత్తున జరుగుతుండటంతో కార్మిక సంఘాలను యాజమాన్యం చర్చలకు పిలవక తప్పనిస్థితి ఏర్పడింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ లేబర్‌ కమిషనర్‌ సమక్షంలో స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యానికి, కాంట్రాక్టు కార్మిక సంఘాలకు మధ్య సుదీర్ఘ చర్చలు నడిచాయి. చివరకు దిగివచ్చిన యాజమాన్యం ప్రస్తుతానికి కాంట్రాక్టు కార్మికులను ఎవరినీ తొలగించబోమని, ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో తొలగించిన 3700 మంది కాంట్రాక్టు కార్మికుల లేబర్‌ పాస్‌లను తిరిగి పునరుద్ధరిస్తామని, అలాగే సిస్టంలో బయోమెట్రిక్‌ డేటాబేస్‌ను కూడా పునరుద్ధరిస్తామని చెప్పింది. పాత పద్ధతిలోనే గేట్‌ పాస్‌లను కొనసాగించడానికి అంగీకరించింది. ఏడు రోజులలో అన్‌లైన్‌లో పునరుద్ధరణ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపింది. ఈ చర్చల సందర్బంగా కార్మిక నేతలు మాట్లాడుతూ ఎవరికి అన్యాయం జరిగినా ఊరుకోబోమన్నారు. లేబర్‌ కమిషనర్‌ మహంతి మాట్లాడుతూ కార్మికుల ఉపాధి పరిరక్షణ, స్టీల్‌ప్లాంట్‌ ఉత్పత్తి పెంపుదల వంటి అంశాలపై యాజమాన్యం దృష్టి సారించాలన్నారు. ఈ చర్చల్లో స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం నుంచి జిఎం (హెచ్‌ఆర్‌ )ఎన్‌.భాను, డిజిఎం ఎస్‌కె.కర్‌, కార్మిక సంఘాల తరుపున జి.శ్రీనివాస్‌, ఒబి.రావు కెపి.సుబ్రహ్మణ్యం, చట్టి నర్సింగరావు, మంత్రి రవి, నగేష్‌, శశిభూషణ్‌, ధనలక్ష్మి, బొడ్డు శివరాజేష్‌, యు.అప్పారావు, రామిరెడ్డి, పద్మనాభం పాల్గొన్నారు.

ఉదయం నుండి ఉధృతంగా
అంతకుముందు బుధవారం ఉదయం నుంచి కార్మికుల ఆందోళనలు ఉధృతంగా సాగాయి, . కూర్మన్నపాలెం కూడలిలో ఉదయం 10 గంటల నుంచి కార్మికులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి కార్మికులను తొలగించాలని చూసినా ఎవరూ వెనక్కితగ్గలేదు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. కాంట్రాక్టు కార్మికులను ఉద్దేశించి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు జె.అయోధ్యరామ్‌ మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ను నిర్వీర్యం చేయడానికి యాజమాన్యం ప్రయత్నిస్తోందని, అందులో భాగంగానే 4 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించడానికి పూనుకుందని తెలిపారు.

షర్మిల సంఘీభావం
కార్మికుల ఆందోళన విషయం తెలిసి పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల అక్కడకు చేరుకుని వారికి సంఘీభావం తెలిపారు. ఆమె కూడా రోడ్డుపై బైఠాయించి నినదించారు. 48 గంటల్లోపు రాష్ట్ర ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న నాలుగు వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులను విధుల్లోకి తీసుకునేలా చర్యలు చేపట్టకుంటే నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు. నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లు స్టీల్‌ప్లాంట్‌ రక్షణ కోసం ముందుకొచ్చి కార్మికులకు మద్దతు ఇవ్వాలన్నారు. పాలకుల నిర్వాకం వల్లే ప్లాంట్‌ నిర్వీర్యం అవుతోందని తెలిపారు.

కొనసాగిన ఉక్కు దీక్షలు
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని, సొంతగనులు కేటాయించాలని, ప్రైవేటీకరణ విధానాలు మానుకోకపోతే తెలుగోడి సత్తా చూపుతామని కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని అఖిలపక్ష కార్మిక సంఘాలు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి.సత్యనారాయణమూర్తి, మాజీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కెఎస్‌.చలం హెచ్చరించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాల జెఎసి చేపట్టిన దీక్షల్లో భాగంగా జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద బుధవారమూ దీక్షలు కొనసాగాయి. వీటిని ప్రారంభిస్తూ వారు మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రజారక్షణ కన్వీనర్‌ వివి.రమణమూర్తి నాయకత్వంలో విశాఖ నగరంలోని ఎల్‌ఐసి దరి అంబేద్కర్‌ విగ్రహం నుంచి గురజాడ జంక్షన్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌, ఆశీలు మెట్ట జంక్షన్‌ మీదుగా జివిఎంసి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.

➡️