Labour Codes: లేబర్‌ కోడ్స్‌ రద్దు చేయాలి

మే 20న సమ్మెను జయప్రదం చేయండి
సదస్సులో వక్తలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నాలుగు లేబర్‌ కోడ్స్‌ను తక్షణం రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి. దీనితో పాటు జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకమైన ప్రైవేటీకరణ విధానాలు రద్దు చేయాలని, కనీస వేతనం నెలకు రూ.26 వేలు చెల్లించాలని, 8 గంటల పని విధానం అమలు చేయాలన్న డిమాండ్లతో వచ్చే నెల 20వ తేదీన దేశ వ్యాప్తంగా నిర్వహించే కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మికసంఘాల నేతలు పిలుపునిచ్చారు. విజయవాడలోని ఎంబివికెలో కేంద్ర కార్మిక సంఘాల రాష్ట్ర సదస్సు శుక్రవారం జరిగింది. ఈ సదస్సుకు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నరసింగరావు మాట్లాడుతూ.. కరోనా సమయంలో పార్లమెంట్‌లో ఎటువంటి చర్చ లేకుండా కేంద్రం నాలుగు లేబర్‌ కోడ్‌లను దొడ్డిదారిన తీసుకువచ్చిందన్నారు. కార్పొరేట్‌ సంస్థలకు లాభాలు అందించేందుకు కార్మిక చట్టాలను రద్దు చేసి ఆ స్థానంలో లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చేందుకు కేంద్రం ఈ కుట్ర చేసిందని చెప్పారు. ఈ కోడ్‌లను ఏప్రిల్‌ నుంచి అమలు చేసేందుకు సిద్ధం కావాలని మార్చి నెలాఖరులో అధికారులకు సర్యులర్‌ జారీ చేశారని తెలిపారు. లేబర్‌ కోడ్‌లు అమలులోకి వస్తే ఇప్పుడున్న అనేక హక్కులను కార్మికులు కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మాట్లాడుతూ, లేబర్‌ కోడ్స్‌ అమలు వల్ల కార్మికులు వెట్టిచాకిరి చేయాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. ఉద్యోగ భద్రత, ఇఎస్‌ఐ, కనీస వేతనాలు, పోరాడే హక్కులు కోల్పోతారని చెప్పారు. కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కుంటుపడి కుటుంబాలు వీధినపడతాయన్నారు. వైఎస్‌ఆర్‌సిపి ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు పి.గౌతంరెడ్డి మాట్లాడుతూ.. కార్మిక వ్యతిరేక చట్టాలు, విధానాలు గత ప్రభుత్వాల హయాంలో కూడా అమలు చేయాలని ప్రయత్నాలు జరిగితే కార్మికుల సంఘటిత పోరాటాలతో తిప్పికొట్టగలిగామన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం శ్రామికవర్గ ప్రయోజనాలకు వ్యతిరేకంగా లేబర్‌ కోడ్స్‌ను తీసుకువచ్చి, అమలుకు చర్యలు చేపట్టిందని చెప్పారు. దేశవ్యాప్త కార్మిక సమ్మెకు వైసిపిట్రేడ్‌ యూనియన్‌ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు మే 20న దేశ వ్యప్త కార్మిక సమ్మెకు సంబంధించిన డిమాండ్లతో కూడిన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సమ్మె జయప్రదం చేసేందుకు చేపట్టాల్సిన ముందస్తు కార్యక్రమాలను వివరించారు. వీటిని సదస్సుకు హాజరైన కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు ఏకగ్రీవంగా ఆమోదించారు. తొలుత పహల్గాం ఉగ్రదాడి మృతులకు సంతాపం తెలియజేస్తూ మౌనం పాటించారు. ఈ సదస్సులో ఐఎఫ్‌టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పోలారీ, కార్యదర్శి ఎం.రామకృష్ణ, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎ.వి నాగేశ్వరరావు, ఏఐటియుసి రాష్ట్ర నాయకులు సుధీర్‌ బాబు, ఐఎఫ్‌టియు (న్యూ) రాష్ట్ర కార్యదర్శి జాస్తి కిషోర్‌ బాబు, టియుసిఐ రాష్ట్ర అధ్యక్షులు మరీదు ప్రసాద్‌ బాబు, టియుసిసి రాష్ట్ర నాయకులు రాజు, వైఎస్‌ఆర్టీయుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.శ్రీనివాసరావు, హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు డి.ఎన్‌ శ్రీనివాస్‌, ఎఐటియుసి రాష్ట్ర గౌరవాధ్యక్షులు వి.రాధాకృష్ణమూర్తి, అధ్యక్షులు రావుల రవీంద్ర, ఎస్‌డబ్ల్యుఎఫ్‌ రాష్ట్ర నాయకులు టి.పి.ఆర్‌ దొర, రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ డివిజన్‌ అధ్యక్షులు పి.లీల, బెఫి నాయకులు వై.శ్రీనివాసరావు, అజరు కుమార్‌, ఎల్‌ఐసి సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ నాయకులు జి.కిషోర్‌ కుమార్‌, శ్రామిక మహిళ రాష్ట్ర కన్వీనర్‌ కె.ధనలక్ష్మీ, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, ఎఐటియుసి నాయకులు సిహచ్‌.రామారావు, బ్యాంక్‌ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు పి.శ్రీనివాసరావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, వైఎస్‌ఆర్‌టియుసి జిల్లా అధ్యక్షులు రవి, శ్రామిక మహిళ నాయకురాలు (ఎఐటియుసి) శాంతి, చిన్నమ్మ, రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ నాయకులు టి.సుబ్బారెడ్డి, ఆల్‌ ఇండియా బిఎస్‌ఎన్‌ఎల్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు కెఎస్సి బోస్‌, కో ఆపరేటివ్‌ బ్యాంక్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు కెవి.ఎస్‌ రవికుమార్‌ తదితరులు ఈ సదస్సులో ప్రసంగించారు.

➡️