హామీలు అమలు చేయలేక లడ్డూ రాజకీయం : ఆకేపాటి

Sep 28,2024 10:36 #TTD LADDU, #ycp mla

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయినా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో ఒకటి కూడా అమలు చేయలేక చంద్రబాబు నాయుడు అత్యంత పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రాన్ని అపహాస్యం చేస్తూ లడ్డూ రాజకీయం చేస్తున్నాడని రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన పట్టణ శివారులోని యల్లమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల అనంతరం పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకేపాటి మాట్లాడుతూ విజయవాడలో సంభవించిన వరదలకు జగన్మోహన్ రెడ్డి కారణమని నిందలు వేయడం హాస్యాస్పదమని అన్నారు. ఇచ్చిన హామీలలో ఒకటి కూడా నెరవేర్చుకున్న ప్రజలను నిట్ట నిలువునా మోసం చేస్తున్నాడని అన్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల పుణ్యక్షేత్రంపై రాజకీయాలు చేయడం సబబు కాదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో తిరుమలలో జంతువుల కొవ్వు కలిపారన్న చంద్రబాబు చేసే ఆరోపణలు నిజమైతే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని సిట్ తో కాకుండా కేంద్ర దర్యాప్తు బృందం సిబిఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రిని తిరుమల వెళ్ళనీయకుండా డిక్లరేషన్ కోరడం ఏంటని ప్రశ్నించారు. భగవంతుడి ముందు అందరూ సమానమేనని, కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. చంద్రబాబు నుంచి రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారని, ముందుగా ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో ప్రజాపక్షాన వైసిపి రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పోలా శ్రీనివాసులు రెడ్డి, అన్నమాచార్య యూనివర్సిటీ వైస్ చైర్మన్ చొప్పా యల్లారెడ్డి, మహిళా నాయకురాలు మిరియాల సురేఖ, వైసీపీ నాయకులు సత్యాల రామకృష్ణ, దాసరి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️