లక్ష్మీనారాయణ సేవలు స్ఫూర్తిదాయకం

  • డిజిపి ద్వారకా తిరుమలరావు
  • చలం, శివశంకర్‌కు సాహిత్య విమర్శ పురస్కారాలు ప్రదానం

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖలో ఉన్నత అధికారిగా పని చేసిన తన తండ్రి సిహెచ్‌ లక్ష్మీనారాయణ తమకు విలువలతో కూడిన జీవన విధానాన్ని, క్రమశిక్షణను అందించారని.. తనతోపాటు తన సోదరి, సోదరుడు ఉన్నత స్థానాల్లో ఎదగటానికి వారు అందించిన జీవితపు విలువలు అమూల్యమైనవని, పలువురికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర డిజిపి సిహెచ్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు. గుంటూరు బృందావన్‌ గార్డెన్స్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం పద్మావతి కల్యాణ వేదికపై సిహెచ్‌ లక్ష్మీనారాయణ స్మారక సమితి ద్వారా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్‌, ప్రముఖ రచయిత, విమర్శకులు జిఎస్‌.చలంకు సాహిత్య విమర్శ పురస్కారాలను ప్రదానం చేశారు. డిజిపి సోదరి, కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్‌ సుశీలమ్మ మాట్లాడుతూ.. సాహిత్య విమర్శకులను గుర్తించి, గౌరవించడం సామాజిక బాధ్యతగా భావించి గత ఐదేళ్లుగా ప్రముఖులకు తమ తండ్రి పేరున పురస్కారాలు అందజేస్తున్నట్లు తెలిపారు. సభకు ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం అధ్యక్షురాలు డాక్టర్‌ భవానిదేవి అధ్యక్షత వహించారు. దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు చిట్టిపోతు మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఎక్సైజ్‌ కమిషనర్‌ అహ్మద్‌ షరీఫ్‌, డాక్టర్‌ ఒవి రమణ, డాక్టర్‌ వివి రామకుమార్‌, ఎస్‌ఎం సుబాని, పలువురు రచయితలు, సాహితివేత్తలు, విమర్శకులు పాల్గొన్నారు.

➡️