మూడు నెలల్లో శాంతిభద్రతలు అదుపులోకి

 

  • హోంశాఖ సమీక్షలో సిఎం ఆదేశం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రానున్న మూడు నెలల్లో రాష్ట్రంలో శాంతి భద్రతలను పూర్తిగా అదుపులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలీసు అధికారులను అదేశించారు. కలెక్టర్ల సమావేశంలో భాగంగా రెండవ రోజైన గురువారం నాడు హోమ్‌శాఖపై సిఎం సమీక్ష నిర్వహించారు తొలుత డిజిపి ద్వారకా తిరుమలరావు పలు అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అనంతరం సిఎం మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ, యువత డ్రగ్స్‌కు గంజాయికి బానిసవ్వకుండా నిఘా పెట్టడం, సైబర్‌ సేఫ్టీ వంటి అంశాలపై పోలీసులు దృషి పెట్టాలని సూచించారు. రహదారి భద్రత, ఆస్తుల పరిరక్షణ వంటి అంశాలనూ విస్మరించకూడదన్నారు. సిసిటివి, డ్రోన్లు, ఎఎఫ్‌ఐఎస్‌, ఎఐ వంటి అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని స్మార్ట్‌ పోలీసింగ్‌ అలవరుచుకోవాలని చెప్పారు. నేరాల నియంత్రణకు పూర్తిగా సాంకేతికతను వినియోగించుకోవాలని, పబ్లిక్‌ స్థలాలు, ప్రార్థనా మందిరాలు, షాపింగ్‌మాల్స్‌ దగ్గర సిసి కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం మానిటరింగ్‌ చేయాలని తెలిపారు. గతంలో నేరస్తులను నేరస్తులుగానే చూశామని, కానీ నేడు రాజకీయ ముసుగులో ఉన్నారని పేర్కొన్నారు. నేరాల నియంత్రణలో సైబర్‌ సెక్యూరిటీ విభాగం కూడా క్రియాశీలకంగా పనిచేయాలని, నేరస్తుల వివరాలు ఆన్‌లైన్లో ఉంచాలని తెలిపారు. అంతకుముందు డిజిపి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తూ ఇప్పటివరకూ 15,587 కెమెరాలు ఏర్పాటు చేశామని, వీటి ఆధారంగా 1,330 కేసులు గుర్తించామని చెప్పారు. రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో సిసిటివి ఫుటేజ్‌ ద్వారా చేధించిన కేసుల వివరాలను వెల్లడించారు. దేవాలయాల దొంగలు, బైకులు, గొలుసు దొంగలను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 14,787 కిలోల గంజాయిని సీజ్‌ చేశామని, 627 మంది అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేశామని చెప్పారు. యువత గంజాయికి బానిసలు కాకుండా బిస్మార్ట్‌, డోంట్‌ స్మార్ట్‌ పేరుతో అవగాహనా కార్యక్రమాలు చేపట్టామని వివరించారు.

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్య

‘ప్రైవేటు విద్యావ్యవస్థను దెబ్బతీయడం మా విధానం కాదు. దానికి దీటుగా ప్రభుత్వ విద్యారంగాన్ని తీరిదిద్ధడమే మా లక్ష్యం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విద్యాశాఖపై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యలో నాలెడ్జ్‌ను ప్రోత్సహించే సమయంలో ప్రభుత్వం, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో కలిసి నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానాల ద్వారా అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు తేవాలని చెప్పారు. డిజిటల్‌ టీచింగ్‌, లెర్నింగ్‌పై దృష్టిసారించాలని చెప్పారు. స్కిల్‌డెవలప్‌మెంట్‌ విభాగాన్ని కూడా విద్యాశాఖ కిందకు తీసుకురావాలని అన్నారు.

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్‌ పెరిగి జీరో డ్రాపవుట్స్‌ తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, అకడమిక్‌ ఫలితాలకు పొంతన ఉండటం లేదన్నారు. విద్యార్ధులకు అందించే మధ్యాహ్న భోజనంపై కలెక్టర్లు దృష్టి సారించాలని ఆదేశించారు. ఉన్నత విద్యలో కూడా హాస్టల్‌, భోజన సౌకర్యాలపై దృష్టిపెట్టాలని చెప్పారు. విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో 79,75,284 మంది విద్యార్ధులు ఉన్నారని చెప్పారు. ప్రపంచ బ్యాంకు సహకారంతో సపోర్టింగ్‌ ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ (సాల్ట్‌) ప్రాజెక్టు అమలు చేస్తున్నామని తెలిపారు. 78శాతం మంది విద్యార్ధులకు అపార్‌ ఐడీలు జారీ చేశామని చెప్పారు.

జగనన్న ఇళ్ల పట్టాలు పరిశీలించండి అనర్హులకు రద్దు చేయండి : సిఎం ఆదేశం

జగనన్న కాలనీల్లో ఇచ్చిన ఇళ్లపట్టాలను పరిశీలించి, అనర్హులుంటే రద్దు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్ల సమావేశంలో ఈ విషయాన్ని మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, అచ్చెన్నాయుడు, డోలా బాలవీరాంజనేయస్వామి, నాదెండ్ల మనోహర్‌ ప్రస్తావించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ హోసింగ్‌, రెవెన్యూ శాఖలు జగనన్న కాలనీల్లో ఇచ్చిన ఇళ్లస్థలాలను పరిశీలించాలని చెప్పారు. లబ్ధిదారులందరినీ పరిశీలించి నిజమైన లబ్ధిదారులు ఉంటే పట్టాలు ఇస్తామని, లేదంటే రద్దు చేస్తామని చెప్పారు. ఈ అంశం డైరెక్టర్‌ విజిలెన్స్‌ కూడా విచారణ చేయాలని అన్నారు. భూ వివాదాలు, భూ కబ్జాల కేసుల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో జాయింట్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. హోంశాఖకు వస్తున్న ఫిర్యాదుల్లో అత్యధిక భాగం భూసంబంధిత వివాదాలే ఉంటున్నాయని, వీటి పరిష్కారానికి రెవెన్యూ, హోంశాఖలు కలిసి పనిచేస్తే బాగుంటుందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కోరగా చంద్రబాబు పై విధంగా స్పందించారు. జిల్లా కలెక్టర్‌, ఎస్పి, ఆర్‌డివో, డిఎస్పి సభ్యులుగా జాయింట్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని అన్నారు.

22ఏ భూములను జాగ్రత్తగా పరిశీలించాలి : మంత్రి అనగాని

22ఏ భూములను జాగ్రత్తగా పరిశీలించాలని రెవెన్యూ శాఖమంత్రి అనగాని సత్యప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. 22ఏ లో దేవాదాయ భూములతో పాటు రకరకాల భూములు ఉన్నాయని అన్నారు. అందువల్ల ఏ కేసుకు ఆ కేసు పరిశీలించాలని చెప్పారు. రెవెన్యూ సదస్సులు నిర్వహణలో ఒక అడ్వకేట్‌ను అందుబాటులో ఉంచి లీగల్‌ సంబంధిత ఫిర్యాదులను అక్కడక్కడే పరిష్కరించాలని తెలిపారు. రెవెన్యూ శాఖ ప్రత్యేకప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియా మాట్లాడుతూ శాఖకు వచ్చిన ప్రతిఫిర్యాదును కలెక్టర్లు పరిష్కరించాలని చెప్పారు. ఎమ్మెర్వోలు డిజిటల్‌ లాకర్లను ఎవరికీ ఇవ్వొద్దని ఆదేశించారు.

గ్రీన్‌ ఎనర్జీని ప్రమోట్‌ చేయండి

రాష్ట్రంలో గ్రీన్‌ ఎనర్జీని ప్రమోట్‌ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. విద్యుత్‌శాఖపై సమీక్షలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దాలని, అవసరమైతే గ్రీన్‌ కారిడార్స్‌ తయారు చేయాలని చెప్పారు. సౌర, పవన, పంప్డ్‌ స్టోరేజ్‌, బ్యాటరీ విద్యుత్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రీన్‌ ఎనర్జీ,గ్రీన్‌ హైడ్రోజన్‌ చాలా ముఖ్యమని చెప్పారు. పిఎం సూర్యఘర్‌ కింద ప్రతి ఇంటిపై విద్యుత్‌ ఉత్పత్తి చేసే పరిస్థితి రావాలని చెప్పారు. ఈ పథకంలో సబ్సిడీ కూడా వస్తోందని, వినియోగించుకున్న తరువాత మిగిలిన విద్యుత్‌ను అమ్ముకోవచ్చని వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రోన్లు ద్వారా విద్యుత్‌ తీగలను తనిఖీ చేయాలని చెప్పారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌ సోలార్‌ రూఫ్‌టాప్‌ ఏర్పాట్లపై కలెక్టర్లు దృష్టిసారించాలని కోరారు. పిఎం సూర్యఘర్‌లో కోటి ఇళ్లకు సోలార్‌ రూప్‌టాఫ్‌ పెట్టాలన్నది కేంద్రప్రభుత్వం లక్ష్యమని చెప్పారు.

స్తంభాలు తొలగించేందుకు డబ్బులు : అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం చేసే సమయంలోగానీ, పేదవాళ్లు ఇళ్లు నిర్మించే సమయంలో అడ్డుగా ఉన్న స్తంభాలను తొలగించేందుకు విద్యుత్‌ శాఖ అధికారులు అందుకయ్యే భారాన్ని వినియోగదారులపై మోపుతున్నారని వ్యవసాయ శాఖమంత్రి కె అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు స్పందిస్తూ ఆ ఖర్చులు ప్రభుత్వం భరించాలంటే వినియోగదారులపై విద్యుత్‌ చార్జీల భారం పడుతుందని చెప్పారు. మరలా విద్యుత్‌ చార్జీలు పెంచుతున్నారని అంటారని అన్నారు. ఈ అంశంపై సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు.

➡️