- తక్షణం సహాయ చర్యలు చేపట్టాలి
- ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కరువు పరిస్థితుల నుంచి రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైన అలసత్వం ప్రదర్శిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విమర్శించింది. పర్యటనలకే పరిమితం కాకుండా తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకరరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లలో రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్‌టిఆర్, ఏలూరు జిల్లాల్లో తుపాను కారణంగా లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. రాయలసీమలోని అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో లోటు వర్షపాతం కారణంగా లక్షలాది ఎకరాల్లో వేసిన వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, పత్తి, పప్పుశనగ, ఆముదం వంటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వివరించారు. సుమారు 75 మండలాల్లో వర్షభావ పరిస్థితుల వల్ల పంటలు దెబ్బతింటే రాష్ట్రప్రభుత్వం కేవలం 54 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకుందని విమర్శించారు. ప్రభుత్వ అధికారులు వాస్తవ పరిస్థితులను గమనించకుండా అరకొర కరువు ప్రకటనలతో సరిపుచ్చుకున్నారని తెలిపారు. కరువు ప్రకటనతో సరిపెట్టుకోకుండా రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద ఎకరాకు రూ.25 వేల చొప్పున అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 2023-24 ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన రైతులకు పంటల బీమా అమలు చేయాలని, రబీలో పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు.