- నికరంగా పోరాడేది ఎర్ర జెండానే – మోడీ బడ్జెట్ ప్రజల కోసం కాదు
- కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసినా బాబు మౌనం
- సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కరత్
- పార్టీ 27వ మహాసభ సందర్భంగా నెల్లూరులో భారీ ర్యాలీ, బహిరంగసభ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- నెల్లూరు : మనువాద, కార్పొరేట్ బిజెపిని ప్రతిఘటించేది ఎర్ర జెండాయేనని, వెనక్కి తగ్గేదే లేదని, మునుముందుకేనని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కరత్ చెప్పారు. బిజెపిపై పోరాటంలో ఇతర వామపక్షాలతో పాటు, ప్రజాతంత్ర శక్తులను సమీకరిస్తామని, ఉద్యమ బలోపేతానికి ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేక, ధనికుల అనుకూలమని, అటువంటి వంచక బడ్జెట్‌ను నిరసించాలని కోరారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మోడీ సర్కార్ అన్యాయం చేసినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడకుండా నోరు మూసుకున్నారన్నారు. మూడు రోజులుగా ఇక్కడ జరుగుతున్న సిపిఎం 27వ రాష్ట్ర మహాసభను పురస్కరించుకొని చివరి రోజు సోమవారం నెల్లూరు నగరంలో భారీ ప్రజా ప్రదర్శన, బహిరంగసభ నిర్వహించారు. ర్యాలీ ఆత్మకూర్ బస్‌స్టాండ్ నుంచి సభా ప్రాంగణం విఆర్ కాలేజి గ్రౌండ్ వరకు సాగింది. విఆర్‌సి గ్రౌండ్‌కు మల్లు స్వరాజ్యం ప్రాంగణంగా నామకరణ చేశారు. సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్ అధ్యక్షత వహించిన సభలో బృందా కరత్ ప్రసంగిస్తూ… మనువాద, కార్పొరేట్ బిజెపి విధానాలు రాజ్యాంగ విలువలను భక్షిస్తున్నాయి. మైనార్టీల లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. అమాయక ముస్లిం యువకులను టార్గెట్ చేస్తున్నాయి. సమాజాన్ని చీల్చి విద్వేషాలు రగిలిస్తున్నాయి. మోడీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాపై నడుస్తోంది. బిజెపి సర్కార్ భుజానేసుకొని ప్రచారం చేస్తున్న మహా కుంభ మేళా తొక్కిసలాటలో జనం చనిపోయారు. ఆర్‌ఎస్‌ఎస్ అంటే… రాష్ట్రీయ సర్వనాశన్ సమితి. ఫాసిస్టు ఆర్‌ఎస్‌ఎస్, దాని హిందూత్వ భావజాలానికనుగుణంగా పని చేసే బిజెపిని నికరంగా ముందుండి వ్యతిరేకించేది సిపిఎం, కమ్యూనిస్టులే. కొన్ని పార్టీలు బిజెపిని పైకి తిడుతూ వెనుక చేతులు కలుపుతున్నారు. మేం అలా కాదు. ప్రతికూల పరిస్థితులున్నా, ఒడుదుడుకులు ఎదురైనా బిజెపిపై పోరాడే విషయంలో ఎర్ర జెండా వెనకడుగు వేయదు…
ధనికులకు అనుకూలం
మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్ ధనికులకు అనుకూలం, ప్రజలకు వ్యతిరేకమని బృందా కరత్ అన్నారు… ప్రజల సంక్షేమానికి బడ్జెట్‌లో ఏమీ లేదు. అన్నీ కోతలే. లక్ష కోట్లకు పైగా నిధులు తగ్గించారు. స్కీం వర్కర్లకు, కార్మికుల సంక్షేమానికి, ఉపాధి హామీకి ఒక్క రూపాయి అదనంగా ఇవ్వలేదు. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కోరుతూ ఒక వైపు రైతులు ఆందోళన చేస్తుండగా ఒక్క రూపాయి కూడా అందుకు కేటాయించలేదు. ఇదే సమయంలో ధనికులపై ఒక్క రూపాయి పన్ను పెంచలేదు. అదానీ, అంబానీలను బడ్జెట్ ప్రోత్సహిస్తోంది. ధనికులపై పన్నులేసి ప్రజలకు ఖర్చు చేయమని మేం అడుగుతున్నాం. ఆర్థిక సర్వేలో ప్రజల స్థితిగతులు దిగజారుతున్నాయని తేలింది. నిరుద్యోగం పెరుగుతోంది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. ప్రజల జేబుల్లో డబ్బుల్లేవు. ఈ విషయంపై మోడీ ప్రభుత్వానికి కనీస స్పృహ లేదు. ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను ప్రజలు నిరసించాలి…
బాబు నోటిని కట్టేసుకున్నారు
బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసినా, నిధులు కేటాయించకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు కట్టేసుకున్నారని బృందా కరత్ అన్నారు… బాబు ఢిల్లీ ఎందుకు వెళ్లినట్లు? ప్రత్యేక హౌదా కోసమా, పోలవరం నిధుల కోసమా, విభజన హామీలు అడిగారా, విశాఖ ఉక్కుపై మాట్లాడారా? తమపై కేసులు, స్వప్రయోజనాల కోసం కేంద్రాన్ని ఒక్క మాట అడగలేదు. పెదాలకు ఫెవికాల్ రాసుకున్నారు. చంద్రబాబు అంటే సిగ్గులేని బాబు… అని బృందా కరత్ విమర్శించారు.
సుందరయ్య పురిటిగడ్డ
నెల్లూరు పోరాటాల నేల అని, పుచ్చలపల్లి సుందరయ్య పురిటిగడ్డ అని చెప్పారు. తాను యువ నాయకురాలుగా నెల్లూరులో డాక్టర్ల బృందంతో పర్యటించానని గుర్తు చేసుకున్నారు. ఈ ప్రాంతంలో ఎర్రజెండా నాయకత్వంలో భూస్వాములకు వ్యతిరేకంగా, కష్ట జీవుల తరపున పోరాటాలు జరిగాయని, ఎందరో త్యాగాలు చేశారని, ఉద్యమంలో అమరులయ్యారని, రెడ్‌సెల్యూట్ అని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన వి శ్రీనివాసరావుకు సభా సమక్షంలో విప్లవాభినందనలు తెలిపారు. తొలుత తెలుగులో ‘సోదర సోదరీ మణులారా… ‘ అని ప్రసంగాన్ని ప్రారంభించి సభికులను ఉత్సాహపరిచారు. బహిరంగసభలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ బేబి, బివి రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్, ఎస్ పుణ్యవతి, కె హేమలత, ఆర్ అరుణ్ కుమార్, బి వెంకట్, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మహాసభ ఆహానసంఘం నుంచి విఠపు బాల సుబ్రమణ్యం, మాదాల వెంకటేశ్వర్లు, చండ్ర రాజగోపాల్, డాక్టర్ రాజేశ్వరరావు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్దిపై ప్రత్యామ్నాయ ప్రణాళికను నాయకులు విడుదల చేశారు. సిపిఎం సీనియర్ నాయకులు జక్కా వెంకయ్య స్వగ్రామం దామరమడుగు నుంచి తెచ్చిన అమర జ్యోతిని నాయకులు అందుకున్నారు. మహాసభ ప్రారంభానికి ముందు ప్రజా కళాకారులు విప్లవ గీతాలను ఆలపించారు.