వైసిపి అధినేత జగన్‌తో నేతలు భేటీ

Jun 10,2024 22:45 #jagan, #YCP Leaders
  • భవిష్యత్తు కార్యాచరణపై చర్చ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ఘోర పరాజయం పాలైన తర్వాత వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటి నుంచి బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు, గెలిచినవారు సోమవారం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో భేటీ అయ్యారు. ఓటమికి కారణాలపై విశ్లేషించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై కొద్దిసేపు చర్చించుకున్నట్లు సమాచారం. శాంతి భద్రతల సమస్యలపై ఇటీవల గవర్నరు, రాష్ట్రపతికి ఫిర్యాదులు చేసినా, ఎటువంటి స్పందన రాకపోవడం పట్ల నేతలు కొంత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నెలలో జరగనున్న శాసనసభ సమావేశాల్లో పార్టీ ఫ్లోర్‌ లీడర్‌గా ఎవరిని నియమించాలనే అంశంపై చర్చించారు. చివరికి బద్వేలు ఎమ్మెల్యే సుధా పేరును నేతలు జగన్‌ వద్ద ప్రస్తావించగా, ఆయన కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రమాణస్వీకారాలు శాసనసభ సమావేశాల్లో చేయాలా? లేక స్పీకర్‌ ఛాంబర్‌లో చేయాలనే అంశంపై మరోసారి చర్చిద్దామని నేతలతో జగన్‌ అన్నట్లు సమాచారం. ఆయనతో భేటీ అయిన వారిలో మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్‌, పుష్పశ్రీవాణితోపాటు మాజీ ఎంపి వంగా గీత, ఎంపి మోపిదేవి వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, బద్వేల్‌ ఎమ్మెల్యే సుధా ఉన్నారు.

➡️