- వినతులు స్వీకరించిన కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పార్టీ కోసం కష్టపడిన తమకు ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులను కేటాయించాలని పలువురు టిడిపి నేతలు కోరారు. తాము పార్టీ కోసం చేసిన పనిని గుర్తించి తగిన పదవి ఇచ్చి గౌరవించాలని టిడిపి కార్యాలయానికి మంగళవారం పోటెత్తారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్, కేంద్ర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, విజయవాడ ఎంపి కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, శ్రీరామ్ రాజగోపాల్, మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి.. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇప్పించాలని పలువురు కళాకారులు కోరారు. ఆగిపోయిన ఇండిస్టియల్ పార్కు ఏర్పాటు పనులను ప్రారంభించాలని విజయవాడలోని భవానీపురం వెల్డింగ్ వర్కర్స్ యజమానుల సంక్షేమ సంఘం సభ్యులు కోరారు. వీటితోపాటు పలు అర్జీలు స్వీకరించిన నేతలు సమస్యలపై సంబంధిత అధికారులు, కలెక్టర్లు, నేతలకు ఫోన్లు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.