- కలెక్టరేట్ వద్ద కోమటిలంక, శ్రీపర్రు వాసుల ధర్నా
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్ : రూ.ఆరు కోట్లు అక్రమంగా కాజేసిన ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి వెంటనే ఆ సొమ్మును జమ చేయాలని కోమటిలంక, శ్రీపర్రు గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లేరు సంఘం నాయకులు, రైతు సత్యనారాయణ మాట్లాడుతూ.. గతంలో టిడిపి ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తమ గ్రామంలో 230 ఎకరాల్లో చెరువులు తవ్వించారని, అనంతరం వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి ఆ చెరువులను స్వాధీనం చేసుకుని ఎకరం రూ.50 వేలకు బయటివారికి లీజుకు ఇచ్చి గ్రామస్తులకు రూ.20 వేలు లీజు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారన్నారు. గడిచిన ఐదేళ్లుగా లీజు డబ్బులు చెల్లించలేదని, మొత్తం సుమారు రూ.ఆరు కోట్ల సొమ్ము అబ్బయ్య చౌదరి, ఆయన తండ్రి కొఠారు రామచంద్రరావు తీసుకున్నారని ఆరోపించారు. వెంటనే ఆ నగదును కోమటిలంక, శ్రీపర్రు గ్రామాలకు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో నాయకులు అంబురి నాగరాజు, నేతల రవి, మోరు రామరాజు, ఘంటసాల శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.