Left: 14 నుంచి 20 వరకు కేంద్ర బడ్జెట్‌పై నిరసనలు

వామపక్ష పార్టీల పిలుపు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రజావ్యతిరేక ప్రతిపాదనలను ప్రజలు తిరస్కరించాలని వామపక్ష పార్టీలు కోరాయి. అఖిల భారత వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా ఈ నెల 14 నుంచి 20 వరకూ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, నిరసనలు, ప్రదర్శనలు, రౌండ్‌టేబుల్‌ సమావేశాలు జరిపి నిరసన తెలపాలని కోరాయి. ఈ మేరకు శుక్రవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఐఎంఎల్‌ న్యూడెమొక్రసీ నాయకులు పి ప్రసాద్‌, సిపిఐఎంఎల్‌ నాయకులు జాస్తి కిషోర్‌, ఎంసిపిఐ(యు) నాయకులు కాటం నాగభూషణం, సిపిఐఎంఎల్‌ లిబరేషన్‌ నాయకులు బి బంగారురావు, ఎస్‌యుసిఐ(సి) నాయకులు బిఎస్‌ అమర్‌నాథ్‌, ఫార్వార్డ్‌బ్లాక్‌ నాయకులు పివి సుందరరామరాజు, ఆర్‌ఎస్‌పి నాయకులు జానకి రాములు ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశారు.
ప్రజల్లో కొనుగోలు శక్తి కుచించుకు పోయినందున ఆర్థిక వ్యవస్థలో తగ్గిన డిమాండ్‌ సమస్యను పరిష్కరించడానికి బదులు అందుకు విరుద్ధంగా మోడీ ప్రభుత్వం సంపన్నులకు రాయితీలు ఇస్తోందని పేర్కొన్నారు. ఖర్చుల్లో కోత పెట్టడం గర్హనీయమని, నిరుద్యోగ సమస్యను ఈ బడ్జెట్‌ పూర్తిగా విస్మరించిందని తెలిపారు. ఆహార సబ్సిడీలు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, సామాజిక సంక్షేమంపై పెట్టిన ఖర్చు గతేడాది కంటే బాగా తగ్గిపోయిందన్నారు. అవసరం ఉన్నప్పటికీ ఉపాధిహామీ పథకానికి నిధులు అదనంగా కేటాయించలేదని, ధరల పెరుగుదల, జిఎస్‌టి పెంపుదలతో అనేక ఇబ్బందులు పడుతున్న కార్మికవర్గాన్ని ఈ బడ్జెట్‌ విస్మరించిందని పేర్కొన్నారు. ప్రజావ్యతిరేక బడ్జెట్‌పై ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయని వివరించారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయిస్తూ చట్టబద్ధమైన హామీ కల్పించాలని, వ్యవసాయ మార్కెటింగ్‌పై జాతీయ విధాన ముసాయిదాను ఉపసంహరించాలని కోరాయి. నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ ద్వారా చేపట్టే ప్రభుత్వరంగ ప్రైవేటీకరణ చర్యలను, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటురంగానికి బదలాయించడాన్ని ఆపాలని, బీమా రంగంలో వందశాతం ఎఫ్‌డిఐలను ఉపసంహరించాలని కోరాయి. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులను 50 శాతం పెంచాలని డిమాండ్‌ చేశాయి. పట్టణ ఉపాధి హామీ చట్టాన్ని ప్రవేశపెట్టాలని, వృద్ధాప్య పెన్షన్లు, ఇతర సామాజిక భద్రతా ప్రయోజనాల కోసం కేంద్ర కేటాయింపులు పెంచాలని డిమాండ్‌ చేశాయి. ఆరోగ్య రంగ కేటాయింపులను జిడిపిలో మూడు శాతానికి, విద్యా రంగానికి ఆరు శాతానికి కేటాయింపులు పెంచాలని కోరాయి. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆహార సబ్సిడీని పెంచాలని, ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమానికి, మహిళా శిశు సంక్షేమానికి, ఐసిడిఎస్‌కు కేటాయింపులు, స్కీమ్‌ వర్కర్లకు ఇచ్చే గౌరవ వేతనాల్లో కేంద్ర వాటాను, రాష్ట్రాలకు నిధుల బదిలీని, కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు పెంచాలని కోరాయి. రాష్ట్రాలతో పంచుకునే విభాగంలో చేర్చని పెట్రోలియం ఉత్పత్తులపై సెస్సులను సర్‌ ఛార్జీలను రద్దు చేయాలని కోరాయి.

 

కుప్తంగా ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు:
– వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కల్పించాలి. వ్యవసాయ మార్కెటింగ్‌పై జాతీయ విధాన ముసాయిదాను ఉపసంహరించాలి.
– నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ ద్వారా చేపట్టే ప్రభుత్వరంగ ప్రైవేటీకరణ చర్యలను, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు రంగానికి బదలాయించడాన్ని ఆపాలి. బీమా రంగంలో వంద శాతం ఎఫ్‌డిఐలను ఉపసంహరించాలి.
– మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులను 50 శాతం పెంచాలి. పట్టణ ఉపాధి హామీ చట్టాన్ని కూడా ప్రవేశపెట్టాలి. వృద్ధాప్యపు పెన్షన్లు, ఇతర సామాజిక భద్రతా ప్రయోజనాల కోసం కేంద్ర కేటాయింపులు పెంచాలి.
– ఆరోగ్య రంగ కేటాయింపులను జిడిపిలో 3శాతానికి పెంచాలి. విద్యా రంగానికి జిడిపిలో ఆరు శాతానికి కేటాయింపులు పెంచాలి.
– ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆహార సబ్సిడీని పెంచాలి.
– ఎస్సి, ఎస్టీ రంగాలకు, మహిళా, శిశు సంక్షేమానికి కేటాయింపులను గణనీయంగా పెంచాలి. వీటిల్లో ఐసిడిఎస్‌కు కూడా కేటాయింపులు పెరగాలి. అలాగే స్కీమ్‌ వర్కర్లకు ఇచ్చే గౌరవ వేతనాల్లో కేంద్రం వాటాను పెంచాలి.
– రాష్ట్రాలకు నిధుల బదిలీని పెంచాలి. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాలకు కూడా నిధులను గణనీయంగా పెంచాలి. రాష్ట్రాలతో పంచుకునే విభాగంలో చేర్చని పెట్రోలియం ఉత్పత్తులపై సెస్సులను, సర్‌చార్జీలను రద్దు చేయాలి.

➡️