- 10 వామపక్ష పార్టీల పిలుపు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గాజాలో ఇజ్రాయిల్ ఆటవిక దాడులు మొదలుపెట్టి ఏడాది అవుతున్న సందర్భంగా తక్షణమే వాటిని ఆపాలని, కాల్పుల విరమణ జరిపి ఘర్షణలకు స్వస్తి పలకాలని కోరుతూ ఈ నెల 7న సంఘీభావ దినంగా పాటించాలని 10 వామపక్ష పార్టీలు ప్రజలకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు బుధవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఐఎంఎల్ న్యూడెమొక్రసీ రాష్ట్ర నాయకులు వై సాంబశివరావు, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సిపిఐఎంఎల్ నాయకులు జాస్తి కిషోర్‌బాబు, ఎంసిపిఐయు నాయకులు కాటం నాగభూషణం, సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు ఎన్ మూర్తి, bస్‌యుసిఐసి నాయకులు బిఎస్ అమర్‌నాథ్, ఫార్వార్డ్ బ్లాక్ నాయకులు పివి సుందరరామరాజు, ఆర్‌ఎస్‌పి నాయకులు జానకిరాములు ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశారు. గతేడాది అక్టోబరు ఏడున ఇజ్రాయిల్ హమాస్ దాడికి ప్రతీకార దాడి పేరుతో పాలస్తీనాపై విచక్షణారహితంగా క్రూరమైన దాడులకు దిగిందని తెలిపారు. ఫలితంగా 42 వేల మందికిపైగా పాలస్తీనియులు మరణించారని పేర్కొన్నారు. వీరిలో మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. వాస్తవానికి ఈ సంఖ్య ఆగస్టు ఆరు నాటికి 85 వేలకుపైగా ఉండొచ్చని ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సింగ్ అంచనా వేసిందన్నారు. ఇందులో ప్రత్యక్ష, పరోక్ష మరణాలు రెండూ ఉన్నాయని, ఇజ్రాయిల్ యుద్దోన్మాద చర్యలు జాతి నిర్మూలనకు దారితీస్తుందని జనవరిలో అంతర్జాతీయ న్యాయస్థానం వ్యాఖ్యానించిందని తెలిపారు. కాల్పుల విరమణ కోసం జరుగుతున్న అర్థవంతమైన అన్ని చర్యలనూ ఇజ్రాయిల్ తొక్కేస్తూ మరోవైపు ఏడాది పొడవునా దాడి కొనసాగిస్తోందని వివరించారు. గాజాలో ఇజ్రాయిల్ సాగిస్తున్న ఊచకోత రాక్షసత్వాన్ని నిరసిస్తూ తక్షణమే యుద్ధాన్ని ఆపాలని, కాల్పుల విరమణ అమలు చేయాలని 10 వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో పాలస్తీనాకు సంఘీభావంగా ఈ నెల 7న రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు, సభలు, సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. ఈ పిలుపును జయప్రదం చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.