విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించాలి : వామపక్షాలు

ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్‌ : ఈనెల 8 న విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకాన్ని రద్దు చేస్తున్నట్లు, సొంత గనులు కేటాయిస్తున్నట్లు, ప్లాంట్‌ ను పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో నడిపించేందుకు అన్ని వనరులు కేటాయిస్తున్నట్లు స్పష్టంగా ప్రకటించాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి మరుపిళ్ళ పైడిరాజ, సిపిఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై.కొండయ్య, సిపిఐ ఎంఎల్‌ నాయకుడు దేవా, తదితరులు మాట్లాడుతూ … ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌లు స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగదని ప్రకటనలు చేస్తున్నారు కానీ కేంద్ర మోడీ ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు, వర్కింగ్‌ కేపిటల్‌ ఇవ్వడంలేదన్నారు. పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్‌ను నడవనివ్వడంలేదన్నారు. కార్మికులకు, ఉద్యోగులకు జీతాలివ్వడంలేదని, నిర్వాసితులకు ఉద్యోగాలివ్వడంలేదని ఆరోపించారు. ప్లాంట్‌లో 5 వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడంలేదన్నారు. పైగా పర్మినెంట్‌, కాంట్రాక్టు కార్మికులను తొలగించటానికి యాజమాన్యం పూనుకుంటోందన్నారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, లోకేష్‌ల ప్రకటనలకు, కేంద్ర ప్రభుత్వ చర్యలకు పొంతనలేదని, పూర్తి విరుద్ధంగా వుందన్నారు. కనుక ప్రధాని మోడీ చేత పై అంశాలపై ప్రకటన చేయించాలని నాయకులు డిమాండ్‌ చేశారు. లక్షమందికి ఉపాధి కల్పిస్తున్న వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను నట్టేటముంచుతూ, పక్కనున్న అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్‌ మిట్టల్‌ ప్రైవేట్‌ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు ఆగమేఘాల మీద చర్యలు తీసుకుంటోందని విమర్శించారు. ఇటీవల ఢిల్లీకి లో ప్రధానితో సమావేశమైన ముఖ్యమంత్రి విశాఖ ఉక్కు కోసం కాకుండా, మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌కు ఇనుప ఖనిజం అంతరాయం లేకుండా సరఫరా చేయాలని, ప్లాంట్‌ ఏర్పాటుకు అన్ని అనుమతులు త్వరగా అందేలా చర్యలు చేపట్టాలని కోరడం అత్యంత ఆందోళన కలిగించే అంశం అన్నారు. విశాఖపట్నం, రాష్ట్ర ప్రయోజనాలకు పూర్తి విరుద్ధంగా ముఖ్యమంత్రి చర్యలు ఉన్నాయన్నారు. టిడిపి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం … విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో నడిచే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని, ప్రధాని మోడీతో ఆ విధంగా ప్రకటన చేయించాలన్నారు. కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న టిడిపి, జనసేనలు తమ సత్తాను ప్రదర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్‌.కె.ఎస్‌.వి కుమార్‌, బి.జగన్‌, బి.పద్మ, పి.కృష్ణారావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జి.ఎస్‌.జె అచ్యుతరావు, ఎం.మన్మధరావు, క్షేత్ర పాల్‌ రెడ్డి, సిపిఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ నాయకులు ఎం.వెంకటేశ్వర్లు, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కార్యదర్శి ఎం.అజ శర్మ, పి.మణి, వై.సత్యవతి, వై.రాజు, ఎం.సుబ్బారావు, ఎస్‌.జ్యోతీశ్వరరావు, కుమార మంగళం, కె.సుధాకర్‌, ఎం.డి బేగం, జి. అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి కార్యకర్తలు విప్లవ గీతాలు ఆలాపించారు.

➡️