CPM: అక్రమ లేఆఫ్‌ ప్రకటించిన అభిజిత్‌ కంపెనీపై చర్యలు

సిపిఎం డిమాండ్‌ 
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కార్మిక చట్టాలు ఉల్లంఘించి అక్రమంగా లేఆఫ్‌ ప్రకటించిన అభిజిత్‌ ఫెర్రోటిక్‌ లిమిటెడ్‌ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. అక్రమంగా లే-ఆఫ్‌ ప్రకటించిన కంపెనీ తెరిపించి కార్మికులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆదివారం లేఖ రాశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న అభిజిత్‌ కంపెనీ.. కార్మికులకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఈ నెల 13 నుంచి మూసేసిందని తెలిపారు. 15 రోజులుగా కార్మికులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారని వివరించారు. కంపెనీ మూసివేయడంతో అందులో పనిచేస్తున్న వెయ్యిమంది కార్మికుల కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యం ఏనాడూ కార్మిక చట్టాలు, కనీస వేతనాలను అమలు చేయలేదని పేర్కొన్నారు. సెజ్‌లో పక్కనే ఉన్న మైతాన్‌, సుందరం, లలితా ఫెర్రో ఎల్లాయిస్‌ కంపెనీల కంటే అభిజిత్‌లోని కార్మికుల జీతాలు తక్కువే అని తెలిపారు. గతంలో కార్మికులు ఆందోళన చేసినప్పుడు డస్ట్‌, హీట్‌ అలవెన్స్‌లు ఇస్తామని అంగీకరించిన యాజమాన్యం మాట తప్పిందని పేర్కొన్నారు. జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని, ప్రతినెలా 5వ తేదీకి ఇవ్వాల్సి ఉండగా, 24వ తేదీ వరకు ఇవ్వడం లేదని వివరించారు. సెజ్‌ల కోసం తమ భూములు త్యాగం చేసి నిర్వాసితులుగా మారిన వారే అత్యధికంగా ఈ కంపెనీలో పనిచేస్తున్నారని తెలిపారు. తమ ప్రాంతంలో కంపెనీలు వస్తే తమకు, తమ పిల్లలకు ఉపాధి దొరుకుతుందని భావించిన నిర్వాసితుల జీవితాలతో అభిజిత్‌ యాజమాన్యం చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కాలంలో విధులకు రాలేని పరిస్థితుల్లో కూడా బలవంతంగా యాజమాన్యం పనిచేయించుకుందని వివరించారు. అనేక ఇబ్బందులు పడుతూ కరోనాలో కూడా కార్మికులంతా కంపెనీ కోసం పనిచేశారని పేర్కొన్నారు. కోట్ల రూపాయల లాభాలు గడిచినప్పుడు మాట్లాడని యాజమాన్యం నష్టాలు పేరు చెప్పి ఇప్పుడు లేఆఫ్‌ ప్రకటించడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని మూసివేసిన అభిజిత్‌ ఫెర్రోటిక్‌ లిమిటెడ్‌ కంపెనీని తెరిపించి కార్మికులను ఆదుకోవాలని కోరారు.

➡️