ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఉత్తరాంధ్రలోని తోటపల్లి ప్రాజెక్టు ఆధునీకీకరణ పనులకు సంబంధించి పున:పరిశీలన చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. పాలకొండ, రాజాం, కురుపాం నియోజకవర్గాలకు నీరందించే ఆశయంతో నాగావళి నదిపై తోటపల్లి వద్ద 1908లో ఈ ప్రాజెక్టును నిర్మించారన్నారు. దీనికి అనుబంధంగా కుడి,ఎడమ కాలువలు, ఇతర నిర్మాణాల ద్వారా తోటపల్లి ఆయకట్టు పరిధి రైతులకు నీరందేది అని మంత్రి పేర్కొన్నారు. సభ్యుల కోరిక మేరకు తోటపల్లి కుడి, ఎడమ కాలువల ఆవశ్యకతను, ప్రాధాన్యతను పరిగణలోకి తీసుకుని కొత్త రేట్ల ప్రకారం అంచనాలు వేయించి పున:పరిశీలన చేస్తామని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. గొట్టా బ్యారేజ్ ఆదునీకరణకు కూడా రూ.16కోట్లు వ్యయం కాగల ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించి పరిపాలనామోదం కోసం చూస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
