శ్రమ జీవులను ఐక్యపరచడమే లెనినిజం

  • పెట్టుబడిదారి వ్యవస్థ సంక్షోభాలమయం
  • లెనిన్‌ శతవర్ధంతి సభలో మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : శ్రమ జీవులను ఐక్యపరచడం…వారిని పోరాటాల వైపు నడిపించడమే లెనినిజమని మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌.శర్మ అన్నారు. లెనిన్‌ శతవర్థంతి సభను అనంతపురం ఎన్‌జిఒ హోంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ‘లెనినిజం-నేటి సవాళ్లు’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఎంవిఎస్‌.శర్మ ప్రసంగించారు. పెట్టుబడిదారీ వ్యవస్థ ఎప్పుడూ సంక్షోభాల మయమేనని పేర్కొన్నారు. ప్రజల కొనుగోలు శక్తి రోజురోజుకు పడిపోతూ ఉందన్నారు. పాలకులు ప్రజల కొనుగోలు శక్తి పెంచే విధంగా కాకుండా పెట్టుబడిదారులకు ఏ విధంగా లాభాలు చేకూర్చిపెట్టాలన్న వైపు మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారని వివరించారు. ఈ విధానంలో మార్పు రానంత వరకు పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలోనే ఉంటుందన్నారు. ఈ సంక్షోభ సమయంలో కార్మిక హక్కులు మరింతగా హరించబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి సమయంలో కార్మిక వర్గాన్ని మేల్కొలిపి పోరాటాలకు సన్నద్ధం చేయాల్సిన అవసరముందని సూచించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌, మానవ హక్కుల వేదిక నాయకులు చంద్రశేఖర్‌, ఎస్‌ఎం.బాషా, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఒ.నల్లప్ప, బాలరంగయ్య, నాగేంద్రకుమార్‌, సిపిఎం నగర కార్యదర్శులు రామిరెడ్డి, ఆర్‌వి.నాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️