- మతోన్మాద శక్తులను అడ్డుకోవాలి
- లెనిన్ శతవర్థంతి సభలో ప్రబీర్ పుర్కాయస్థ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నిర్దిష్ట పరిస్థితులను నిర్దిష్టంగా అధ్యయనం చేయాలన్న లెనిన్ సిద్ధాంతాన్ని ఆచరించాలని న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థ పిలుపునిచ్చారు. విఐ లెనిన్ శత వర్ధంతి సభ సందర్భంగా ‘వర్తమానంలో లెనిన్ ప్రాధాన్యత’ అనే అంశంపై విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం సభ జరిగింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పుర్కాయస్థ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇటీవల కన్నుమూసిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిపై ప్రజాశక్తి బుకహేౌస్ ప్రచురించిన ‘ప్రియతమ నేతకు అక్షర నివాళి’ పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం పుర్కాయస్థ మాట్లాడుతూ.. గతితర్క భౌతికవాద సిద్ధాంతాన్ని లెనిన్ ప్రకృతి పరిణామాలన్నీంటికీ వర్తింపజేశారని చెప్పారు. ప్రస్తుతం భారతదేశంలో మతతత్వ ప్రమాదం తీవ్రంగా ఉందని చెప్పారు. ప్రజలను, సమాజాన్ని విభజించాలనేది బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన లక్ష్యంగా ఉందన్నారు. ముస్లిం, మైనార్టీ, వామపక్ష శక్తులను, భావజాలాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. ఇటువంటి వాటిని సైద్ధాంతికంగా, తాత్విక పరంగా ఎదుర్కోవాలన్నారు. కుల, మత, వర్ణ, వర్గబేధం లేకుండా అందర్నీ ఏకం చేస్తూ జరిగిన జాతీయోద్యమానికి అనుగుణంగా రూపకల్పన జరిగిన రాజ్యాంగాన్ని ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేకించిందన్నారు. బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ ఎంచుకున్న హిందూత్వ ప్రాజెక్టులో భాగంగానే ‘హిందీ-హిందూ రాష్ట్రం, ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ వంటి నినాదాలను ముందుకు తీసుకొస్తున్నారని వెల్లడించారు. న్యాయమైన డిమాండ్ల కోసం కార్మికులు చేస్తున్న పోరాటాల గురించి ప్రజలకు బడా మీడియా తెలియజేయకుండా ఈ పోరాటాల వల్ల ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడుతోందన్నట్లుగా రాస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వాలు కోరుకుంటున్న విధంగా అవి వార్తలు ఇస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు తమకు తామే చేరవేసుకునే విధంగా సోషల్ మీడియా అభివృద్ధి చెందిందని తెలిపారు. పాలకుల్ని ప్రశ్నిస్తున్న ఈ మీడియాను సామాజిక ఉద్యమంగా మార్చేదిశగా ప్రయత్నాలు జరగాలని సూచించారు. ప్రపంచంలో ఒకపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నా అనేక మానవాభివృద్ధి సూచికల్లో అట్టడుగున దేశం ఉందన్నారు. విద్య, వైద్యానికి ప్రజలు పెద్దయెత్తున డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వాలు, పాలకవర్గాలు అమలు చేస్తున్న ఇటువంటి అంశాలను నిరంతరం ఎండగట్టాలని కోరారు. భావజాల వ్యాప్తికి, పాలక వర్గాల భావాలను ఎదుర్కొనేందుకు, సైద్ధాంతికంగా అభివృద్ధి చెందేందుకు కమ్యూనిస్టులు, వామపక్ష వాదులు, మేధావి వర్గం కృషి చేయాలని కోరారు.
సోషలిజం వైపు ప్రపంచం చూపు : వి శ్రీనివాసరావు
ప్రపంచం సోషలిజాన్ని కోరుకుంటోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. 35 ఏళ్ల క్రితం నాటి నూతన ఆర్థిక విధానాల ప్రభంజనం ప్రస్తుతం లేదన్నారు. లెనిన్ మరోసారి ప్రపంచానికి, భారతదేశానికి అవసరమయ్యారని చెప్పారు. లెనిన్ కేవలం రష్యా విప్లవనేత మాత్రమే కాదని, భారతదేశానికి స్వాతంత్య్రం రావాలని కోరుకున్న అంతర్జాతీయ విప్లవకారుల్లో మొదటి వ్యక్తి అని చెప్పారు. ప్రజల కొనుగోలు శక్తి ఆధారంగా ఆర్థిక పరిస్థితిని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో సెజ్‌ల పేరుతో రైతుల నుంచి 2.5 లక్షల ఎకరాలు భూములు తీసుకొని ఒక్క పరిశ్రమైనా ఏర్పాటు కాలేదన్నారు. సేకరించిన భూముల్లో పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు ఇవ్వకుండా ఎవరు అడ్డుకున్నారని నిలదీశారు. పిపిపి విధానంతో ప్రభుత్వ వ్యవస్థలను ప్రైవేట్‌పరం చేశారని, ఇప్పుడు పి4 నినాదంతో ప్రజల ఆస్తులను ప్రైవేట్ పరం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. ప్రజల ఆస్తులను కొల్లగొట్టేందుకు విజన్-2047 ముసుగు వేస్తున్నారని విమర్శించారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే నిజమైన అభివృద్ధి అని అన్నారు. కార్మికులకు కనీసం వేతనం, రైతులకు గిట్టుబాటు ధర, వ్యవసాయ కార్మికుల వేతనాలు పెంచాలని, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని ఇలా అయితేనే ఆదాయం పెరుగుతుందని చెప్పారు. 40 శాతం భూమి ఇంకా భూస్వాముల చేతుల్లోనే ఉన్నా దేశంలో భూస్వామ్య వ్యవస్థ లేదంటున్నారని చెప్పారు. భూ ఆధిపత్యం రైతుల చేతుల్లోకి వచ్చినప్పుడే అభివృద్ధి జరుగుతుందన్నారు. పెట్టుబడి మరింత క్రూరంగా, అన్యాయంగా ప్రజల శ్రమశక్తిని మరింత దోపిడీ చేస్తోందన్నారు. దేశంలో ఇప్పటికీ వివిధ రూపాల్లో కుల వ్యవస్థ కొనసాగుతున్నా.. అంటరానితనం లేదంటూ మరో తప్పుడు వాదన తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక, ఆర్థిక దోపిడీలకు వ్యతిరేకంగా జమిలిగా పోరాడి అంతం చేసేందుకు లెనిన్ బోధనలు భారతదేశానికి అవసరమని చెప్పారు. లెనిన్ స్ఫూర్తితో కార్మికవర్గం చొరవ తీసుకొని శ్రామికరాజ్యం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. సదస్సుకు అధ్యక్షత వహించిన బాబూరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై సర్దుబాటు ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం విధించబోతుందని వెల్లడించారు. విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన బషీర్‌బాగ్ పోరాట స్ఫూర్తితో మరో పోరాటం చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్‌బుక్, గుడ్ బుక్ నడుస్తోందని విమర్శించారు. ప్రజలకు కావాల్సింది రెడ్ బుక్, గుడ్‌బుక్ కాదని, భారత రాజ్యాంగం అని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫాసిస్టు విధానాలు పాటిస్తూ హిట్లర్ వారసుడిగా కొనసాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ వందన సమర్పణ చేసిన ఈ సదస్సులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి తులసీదాస్, వై వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ పాల్గొన్నారు.