నిర్లక్ష్యం వీడండి

  • నూజివీడు ట్రిపుల్‌ ఐటిలో మంత్రి తనిఖీ
  • కోలుకుంటున్న విద్యార్ధులు

ప్రజాశక్తి – నూజివీడు టౌన్‌ : నూజివీడు ట్రిపుల్‌ ఐటిలో విద్యార్థుల ఆరోగ్యం కుదుటపడుతోంది. మంత్రి కొలుసు పార్థసారధి మరోసారి ట్రిపుల్‌ ఐటి క్యాంపస్‌ను తనిఖీ చేశారు. తాజాగా శనివారం 48 మంది అస్వస్థతకు గురవ్వగా వారిలో 47 మంది ఓపిలో చికిత్స పొందారు. మరొకరు డయేరియాతో ఇన్‌పేషెంట్‌గా చేరారు. అయితే సదరు విద్యార్థి కూడా కోలుకోవడంతో శనివారం సాయంత్రం డిశ్చార్జి చేశామని డాక్టర్‌ నరేంద్రకృష్ణ తెలిపారు. మొత్తంగా వారం రోజుల్లో 11 వందల మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్లుగా ఎవరూ చికిత్స పొందడం లేదు.

మెస్‌ల నిర్వహణ మెరుగుపర్చాలి : మంత్రి
క్యాంపస్‌ మెస్‌ల నిర్వహణ మెరుగుపర్చాలని మంత్రి పార్థసారధి సూచించారు. నిర్లక్ష్యం వీడి విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని అధికారులు, మెస్‌ నిర్వాహకులను ఆదేశించారు. శనివారం ఉదయమే ఆయన నేరుగా క్యాంపస్‌లోని మెస్‌ వద్దకు చేరుకుని విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. మెరుగైన నీటిని విద్యార్థులకు అందించాలని సూచించారు. త్వరలో అన్నింటినీ ప్రక్షాళన చేసి ట్రిపుల్‌ ఐటికి పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు.

➡️