పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పిద్దాం

  • పిఆర్‌సి కమిటీ ఏర్పాటు చేయాలి
  • యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌ వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌ : ఎక్కువమంది పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ఉపాధ్యాయులందరూ కృషి చేసి ప్రభుత్వ బడిని కాపాడుకోవాలని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. తిరుపతి నగరంలో ఆధునీకరించిన యుటిఎఫ్‌ భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం కచ్చపీ కళా క్షేత్రంలో ‘విద్యారంగ సంస్కరణలు – ఆర్థిక అంశాలు’ పై ఐదు జిల్లాల (తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం) ఉపాధ్యాయ చైతన్య సదస్సు యుటిఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కొమ్మోజు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎన్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానం ప్రశ్నించేతత్వం లేకుండా చేస్తోందన్నారు. పాలక వర్గాల ప్రయోజనాల కోసమే విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారని విమర్శించారు. పాఠాలు బోధించనీయకుండా ఉపాధ్యాయులతో ఇతర పనులు చేయిస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ఆధ్వర్యంలో రూపొందించిన రాజ్యాంగ స్ఫూర్తితో రాజ్యాంగ లక్ష్యాల సాధన కోసం ఉపాధ్యాయ, ఉద్యోగులు సంఘటితంగా ముందుకు వెళ్లాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు (ఐవి) మాట్లాడుతూ ఐదు దశాబ్దాలకుపైగా పోరాడి సాధించుకున్న సౌకర్యాలను ఒక్కొక్కటిగా వదులుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని, చట్టసభలలో రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రతినిధులు రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చే పరిస్థితి ఏర్పడిందని, దీన్ని మార్చడం చదువుతోనే సాధ్యమవుతుందని తెలిపారు. యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. 12 వ పిఆర్‌సి ఏర్పాటు చేసి వెంటనే రిపోర్టు తెప్పించుకుని అమలు చేయాలని కోరారు. .పెరిగిన ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కరువు బత్యాన్ని విడుదల చేయాలని, పేరుకుపోయిన వేలకోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయాలని కోరారు. విద్యారంగంలో వస్తున్న పరిణామాలను జాగ్రత్తగా పరిశీలించి విద్యా రంగానికి కీడు కలిగించే విధానాలను ఉపాధ్యాయులు చైతన్యంగా ఎదుర్కోవాలి అన్నారు. సంఘం రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మీ రాజా, ఎస్‌ ఎస్‌ నాయుడు, నవకోటేశ్వరరావు, జివి రమణ, జ్యోతి బసు, చక్రవర్తి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె ముత్యాల రెడ్డి జి జే రాజశేఖర్‌, ఎం సోమశేఖర్‌ నాయుడు, ఎన్‌ మణిగండన్‌, వి వి శేషులు, చలపతి శర్మ, అబ్దుల్‌ హై, హరి ప్రసాద్‌, జాబీర్‌, దండు రామచంద్రయ్య, నిర్మల, గీతమ్మ, కుమారస్వామి, మోహన్‌ బాబు, బండి మధుసూదన్‌ రెడ్డి, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి, సిపిఎం జిల్లా కార్యదర్శి వి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️