అదనపు కేటాయింపులపై ఆర్థిక సంఘాన్ని అడుగుదాం

  • విభజన సమస్యలనూ వివరిద్దాం
  • అధికారులకు సిఎం సూచన
  • వచ్చేవారం తిరుపతిలో కమిషన్ భేటీ

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : గత ఏడాది ఏర్పడిన 16వ ఆర్థిక సంఘం వద్దకు రాష్ట్ర అంశాలు తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆర్థికశాఖ అధికారులతో గురువారం కీలక సమీక్ష కూడా నిర్వహించారు. వచ్చే వారంలో తిరుపతిలో 16వ ఆర్థిక సంఘం సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఏయే అంశాలను కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలన్నదానిపై ఈ సమీక్ష నిర్వహిం చారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి 16వ ఆర్థిక సంఘం అమలులోకి వస్తుంది. ఐదేళ్లపాటు ఈ కమిషన్ పనిచేస్తుంది. దీంతో ముందుగానే అన్ని రాష్ట్రాల నుంచి వాటి అవసరాలు, ఆర్థిక పరిస్థితులపై అధ్యయనం చేయాలని కమిషన్ చైర్మన్ అర్వింద్ పంగారియా నిర్ణయించారు. ఇందులో భాగంగానే వారం రోజుల్లో తిరుపతిలో ఈ భేటీ ఉంటుందని, ఇందులో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పాల్గొంటారని అధికారులు చెబుతున్నారు. ఈ భేటీలో ఏయే అంశాలను ప్రస్తావించాలన్న దానిపై తాజాగా ఆర్థికశాఖతో ఆయన సమీక్షించారు. ప్రధానంగా ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పన్నుల్లో వాటా నిధులపై కీలక నిర్ణయం తీసుకుం టుంది. జనాభా ప్రాతిపదికన ఈ కేటాయింపులు ఉంటాయి. అయితే తాజాగా దక్షిణాదిలో జనాభా తగ్గుతోందని, అందువల్ల కేటాయింపుల్లో నష్టం కలుగుతోందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే జనాభా ప్రాతిపదికన ఇచ్చేదానికన్నా ఎక్కువ నిధులు కోరేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన ఆర్థిక శాఖకు సూచించారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లే పన్నులు పెరుగుతున్నా వాటా నిధులు ఆశించిన స్థాయిలో పెరగకపోవడాన్ని ఈ సమీక్షలో ప్రస్తావించినట్లు తెలిసింది. 2023-24లో రూ.44,699 కోట్లు రాగా, 2024-25లో కేవలం 4,665 కోట్ల పెంచి, రు. 49,364 కోట్లు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించడం తెలిసిందే. మొత్తం కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి 4.047 శాతం మాత్రమే కేటాయింపులు జరిగాయి. దీనిని పెంచుకునేలా ఆర్థిక సంఘానికి ప్రతిపాదించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక కేంద్ర ప్రాయోజిత పథకాలకు వచ్చే నిధులు వాటాపైనా ప్రత్యేకంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్థికశాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతియేటా అంచనాలకన్నా తక్కువగా నిధులు వస్తున్న విషయాన్ని ఆర్థిక సంఘం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించినట్లు సమాచారం. స్థానిక సంస్థలకు వచ్చే నిధులపైనా నిర్దిష్ట ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజన అనంతర పరిణామాలను ఆర్థిక సంఘానికి వివరించాలని, విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు కూడా ఇంతవరకు అమలు కాని విషయాన్ని ఆర్థికసంఘం దృష్టికి తీసుకుపోవాలని సిఎం సూచించారు.

➡️