మతోన్మాద బిజెపిని ఎదుర్కొందాం

  • కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేట్‌ అనుకూల విధానాలపై ఉద్యమాలు ఉధృతం
  • సిపిఎం మహాసభలో రాష్ట్ర పరిస్థితిపై తీర్మానం ఏకగ్రీవ ఆమోదం

ప్రజాశక్తి – కామ్రేడ్‌ సీతారాం ఏచూరి నగర్‌ (నెల్లూరు) : దేశంలో బిజెపి అనుసరిస్తున్న మతోన్మాద విధానాలను తిప్పికొట్టాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేట్‌ అనుకూల విధానాలపై సాగుతున్న ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని సిపిఎం రాష్ట్ర మహాసభ పిలుపునిచ్చింది. ప్రజా సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమాలు చేపట్టాలని నినదించింది. సిపిఎం 27వ రాష్ట్ర మహాసభ నెల్లూరులో శనివారం అత్యంత ఉత్సాహభరితంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రవేశ పెట్టిన రాష్ట్ర పరిస్థితిపై తీర్మానాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. పదేళ్లుగా రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బిజెపితో రాష్ట్రంలోని టిడిపి, జనసేన పార్టీలు అధికారం కోసం జత కట్టాయని పేర్కొన్నారు. ఓపక్క మతోన్మాద విధానాలతోపాటు కార్పొరేట్‌ అనుకూల విధానాలను రాష్ట్రంలో వేగవంతం చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయం కోసం పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలని మహాసభ పిలుపునిచ్చింది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటినా ప్రత్యేక హోదా ఇవ్వలేదని, అందుకే రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదని అన్నారు. పెట్టుబడుల కోసం చేతులు చాచే బదులు కేంద్రాన్ని నిలదీసి ప్రత్యేక హోదా తెచ్చుకుంటే పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని వెతుక్కుంటూ వచ్చేవారని అన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించకపోగా, ప్రభుత్వ రంగంలోని విశాఖ ఉక్కును విక్రయించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అందులోని కార్మికులు, రాష్ట్ర ప్రజానీకం పోరాటం వల్లే ప్యాకేజీ ప్రకటించినప్పటికీ, ప్రయివేటీకరణ ఆలోచన విరమించుకోలేదన్నారు. గత బడ్జెట్‌ సమావేశంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలను వెనుకబడిన ప్రాంతాలుగా పేర్కొన్నప్పటికీ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. మరోవైపు కేంద్రం అమలు చేస్తున్న ఆర్థిక విధానాల వల్ల రాష్ట్ర ప్రజానీకంపై మోయలేని భారాలు పడ్డాయన్నారు. ప్రభుత్వ ఆస్తులను నగదీకరణ పేరిట బడా కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెడుతున్నారని విమర్శించారు. పదేళ్ల మోడీ పాలనలో అవినీతి, అధిక ధరలు, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల హామీలు (సూపర్‌ సిక్స్‌) అమలు చేయకుండా, ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు ప్రభుత్వం విజన్‌ -2047 అంటూ కొత్త పల్లవి అందుకుందని విమర్శించారు. గతంలో ప్రకటించిన విజన్‌-2020 ఎంత వరకు వచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం చెబుతున్న వికసిత్‌ భారత్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్‌-2047 పేరిట ప్రజల సంపదను, వనరులను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు పథకం రూపొందించిందని, ఈ విజన్‌ ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ చెప్పే సరళీకరణ విధానాలను మరింత వేగవంతం చేసేదేనని అన్నారు. ఈ విధానాల అమలులో మోడీ, చంద్రబాబు, జగన్‌ ఒక్కటేనని రుజువైందని అన్నారు. ప్రజలపై తీవ్రమైన భారాలు మోపే విద్యుత్‌ సంస్కరణలను విడనాడాలని డిమాండ్‌ చేశారు. గిరిజన ప్రాంతాలను కార్పొరేట్లకు అప్పగించాలనే వ్యూహంతో 1/70 చట్టాన్ని సవరించాలనే దుర్మార్గమైన ఆలోచన ప్రభుత్వం విరమించుకోకపోతే ప్రతిఘటన తప్పదన్నారు. అమరావతిలో రాజధానిని నిర్మించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, దీంతోపాటు పోలవరం సహా అన్ని ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు ఏర్పాటు చేయాలని మహాసభ డిమాండ్‌ చేసింది. ఉద్యమాలపై నిర్బంధాలను మానుకుని, అక్రమ కేసులను ఎత్తివేయాలని, లేదంటే గత వైసిపికి పట్టిన గతే కూటమికీ పడుతుందని హెచ్చరించింది.
రాష్ట్రంలోనూ బిజెపి మత విద్వేషాలను రెచ్చగొడుతోందని, ఇందుకోసం ఆ పార్టీకి చెందిన ఆర్‌ఎస్‌ఎస్‌, దాని విభాగమైన విహెచ్‌పి తదితర సంస్థలు పథకం ప్రకారం విస్తరిస్తున్నాయన్నారు. ఆలయాలను రాజకీయ కేంద్రాలుగా మార్చి, వాటిపై పెత్తనం చెలాయించేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని అన్నారు. ముస్లింలు, క్రిస్టియన్లకు వ్యతిరేకంగా హిందువుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయన్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం, ఇటీవల జరిగిన తొక్కిసలాట వంటి పరిణామాలను ఆసరాగా చేసుకుని టిటిడిని తన పరిధిలోకి తీసుకునేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందన్నారు. ఇటీవల విజయవాడ సమీపంలో వారు నిర్వహించిన సభ మత విద్వేషాలవ్యాప్తికి సూచికగా చెప్పుకోవచ్చన్నారు. ఈ తరహా మత ప్రమాదాలను ఎదుర్కొని, మత సామరస్యాన్ని పరిరక్షించేందుకు లౌకిక, ప్రజాతంత్రశక్తులను కూడగట్టి పోరాడతామన్నారు.
మహాసభ ఆమోదించిన ఈ తీర్మానంలో 22 డిమాండ్లు పొందుపర్చారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు, నిర్వాసితుల పునరావాసానికి నిధులివ్వాలని, కడప స్టీల్‌ప్లాంట్‌ స్థాపించాలని, విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఆలోచన విరమించాలని, సొంతగనులు కేటాయించి సెయిల్‌లో కలపాలని, పేదలందరికీ ఇళ్లు, ఇళ్లపట్టాల మంజూరు చేయాలని, అసంఘటితరంగ కార్మికులకు వేజ్‌బోర్డు, స్కీమ్‌ వర్కర్లకు వేతనాల పెంపు, నాలుగు లేబర్‌ కోడ్‌ల రద్దు, సిపిఎస్‌ రద్దు, పిఆర్‌సి అమలు, బకాయిల చెల్లింపు, ఏడాదిలో 200 రోజులు ఉపాధి పనులు చూపి రూ.600 తగ్గకుండా వేతనం, నిత్యావసరాల ధరలు, విద్యుత్‌ ఛార్జీలు, ఆస్తి, చెత్తపన్ను తగ్గింపు, పంటలకు గిట్టుబాటు ధరలు, మార్కెటింగ్‌ సదుపాయం, ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఖాళీ పోస్టుల భర్తీ, దళితులపై దాడులు అరికట్టడం, అత్యాచారాలు నిరోధించడం, పోడు భూములకు పట్టాలు మంజూరు, మైనార్టీలకు రక్షణ తదితర డిమాండ్లు ఉన్నాయి.

➡️