ప్రజాశక్తి – ఎడ్యుకేషన్ (విజయవాడ) : అవినీతి అనేది ప్రపంచ దేశాలన్నింటినీ ప్రభావితం చేస్తున్న ఒక సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్య అని విశ్రాంత ఐఎఎస్ అధికారి ఎఎండి ఇంతియాజ్ పేర్కొన్నారు. పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆంధ్ర లయోల కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ ఆంధ్ర లయోల కళాశాలలో ‘అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినం’ సందర్భంగా ‘అవినీతి అంతం – అదే మన పంతం’ అనే అంశంపై సోమవారం కవి సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య సంస్థల పునాదుల్ని ఈ అవినీతి బలహీన పరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ సమరం మాట్లాడుతూ అవినీతి ప్రజాస్వామ్య వ్యవస్థల్ని బలహీనపరిచి, ఆర్థికాభివృద్ధిని కుంటుపరిచి, ప్రభుత్వాల అనిశ్చిత స్థితికి దారి తీస్తోందని వివరించారు. అనంతరం విజయనగరం జిల్లా గుర్ల మండలానికి చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ డాక్టర్ బి.కామేశ్వరరావు చేస్తున్న సేవలకు, ఆయన నిజాయితీని అభినందిస్తూ ఉత్తమ సేవా పురస్కారం అందజేశారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ అంతర్జాతీయ అధ్యక్షులు వేముల హజరత్తయ్య సభాధ్యక్షులుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జిఎపి కిషోర్, వైస్ ప్రిన్సిపల్ కిరణ్, గాంధీ దేశం వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాకులు ఆర్‌ఆర్ గాంధీ నాగరాజన్ పాల్గొన్నారు. 13 మంది రచయితలు తమ కవితలతో సభను ఉత్తేజపరిచారు. పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె మురళీమోహన్ రాజు, తెలుగు శాఖాధ్యక్షులు డాక్టర్ కె శేఖర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
