ఉక్కు కాంట్రాక్టు కార్మికుల జోలికొస్తే ఊరుకోం

Oct 27,2024 21:04 #Visakha Steel Protest

– స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : ఉక్కు కాంట్రాక్టు కార్మికుల జోలికొస్తే సహించేది లేదని స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) గౌరవాధ్యక్షులు ఒవి.రావు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 1354వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) కార్యకర్తలు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల భవిష్యత్తును అంధకారం చేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ఆదేశాలతో ఉక్కు యాజమాన్యం కుట్రలు చేస్తోందన్నారు. శాశ్వత కార్మికులతో భుజం భుజం కలిపి పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల నడ్డి విరవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్మికుల సంఖ్యను కుదించే చర్యలను మానుకోవాలన్నారు. లేనిపక్షంలో స్టీల్‌ప్లాంట్‌ను కార్మికవర్గం స్తంభింపజేస్తుందని హెచ్చరించారు. దీక్షల్లో సంఘం ప్రధాన కార్యదర్శి నమ్మి రమణ, నాయకులు శ్రీనివాసరాజు పాల్గన్నారు.

➡️