రిజర్వేషన్లను కాపాడుకుందాం

May 15,2024 22:30 #visaka steel plant
  •  ఒబిసి అసోసియేషన్‌ స్టీల్‌ప్లాంట్‌ అధ్యక్షులు అప్పారావు

ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటుపరం చేసి దానిలో ఉన్న ఉద్యోగ రిజర్వేషన్లకు స్వస్తి పలకాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను ఖండించాలని, స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవాలని ఒబిసి అసోసియేషన్‌ స్టీల్‌ప్లాంట్‌ అధ్యక్షులు బి.అప్పారావు కోరారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి 1189 రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థల్లో మాత్రమే రిజర్వేషన్లు అమలు అవుతున్నాయన్నారు. రాజ్యాంగ హక్కులకు తూట్లు పొడుస్తూ ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయటానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని, దీనిని తిప్పి కొట్టాలన్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామేశ్వరరావు, వైఎల్‌.నాయుడు, డిసిహెచ్‌ వెంకటేశ్వరరావు, యు.వెంకటేశ్వరరావు సంపూర్ణం, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

➡️