ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పండగలకు చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలను ఆదరిద్దామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పిలుపు మేరకు తెలుగు ప్రజలు.. చేనేతలకు అండగా నిలవాలన్నారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. రంగులు అద్దుతూ చెమటోడ్చి చేనేతల బతుకు చిత్రం మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. రాబోయో రోజుల్లో వరుస పండగల నేపథ్యంలో మన సంస్కృతి, సంప్రదాయాలను చాటే వస్త్రాలను ధరించడంతోపాటు చేనేతల కళారూపాలకు పెద్దపీట వేయాలన్నారు.
భువనేశ్వరికి ధన్యవాదాలు : మంత్రి సవిత
చేనేత కార్మికులకు అండగా నిలిచిన నారా భువనేశ్వరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బిసి సంక్షేమశాఖ మంత్రి సబిత పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. దసరా, దీపావళి పండగలకు చేనేత వస్త్రాలు కొనుగోలు చేద్దామని ఆమె పిలుపునివ్వడం సంతోషించదగ్గ పరిణామమన్నారు.