ధైర్యంగా అడుగులు ముందుకేద్దాం : వైఎస్‌ జగన్

Apr 15,2024 15:16

ప్రజాశక్తి-గన్నవరం

నవరత్న పథకాల ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ న్యాయం జరిగిందనీ, ప్రజల ఆశీర్వాదం ఉన్నాయని, ధైర్యంగా అడుగులు ముందుకేద్దామని వైసిపి అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి అన్నారు. విజయవాడలో రాయి దాడి తర్వాత డాక్టర్ల సూచనతో ఒకరోజు విశ్రాంతి తర్వాత బస్సు యాత్రను ముఖ్యమంత్రి సోమవారం ప్రారంభించారు. గాయమైన జగన్‌ను పరామర్శించేందుకు కేసరపల్లి క్యాంపునకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిపై హత్యాయత్నం ఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు. వైసిపి తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, బస్సు యాత్రకు వస్తున్న విశేష ఆదరణచూసి తట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడ్డారని ముఖ్యమంత్రితో అన్నారు. ప్రజల ఆశీర్వాదం వల్లే అదృష్టవశాత్తూ ఈ దాడి నుంచి సీఎం తప్పించుకున్నారన్నారు. ఇలాంటి దాడులు ఆపలేవని ముఖ్యమంత్రి నేతలతో అన్నారు. దేవుడు దయ, ప్రజల ఆశీర్వాదం ఉన్నాయని నాయకులతో అన్నారు. ధైర్యంగా అడుగులు ముందుకేద్దామన్నారు. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. వైసిపిలో చేరిన టిడిపి నాయకులుమైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, హజ్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ అహ్మద్‌ హుస్సేన్‌, టిడిపి అధికార ప్రతినిధి ముస్తఫా మోమిన్‌, కర్నూలు జిల్లా తాలిమీ బోర్డు అధ్యక్షులు ముఫ్తీ నూర్‌ మహ్మద్‌, మహ్మద్‌ ఇలియాస్‌ వైసిపిలో చేరారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి (వైసిపి) వారిని స్వాగతించగా సిఎం వైసిపి కండువాలు వేసి ఆహ్వానించారు. ఎన్‌టిఆర్‌ జిల్లా టిడిపి సీనియర్‌ నాయకుడు చిరుమామిళ్ల శ్రీనివాసరావు (అలియాస్‌ బుజ్జి), నందిగామ ఎఎంసి మాజీ చైర్మన్‌ వడ్డెలి శ్రీనివాసరావు, మాజీ వైస్‌ ఛైర్మన్‌ వై.రామారావు, గోడపాటి బూరరావు, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి షేక్‌ కరీముల్లా, టీడీపీ ఎన్టీఆర్‌ జిల్లా మైనార్టీ అధ్యక్షురాలు డాక్టర్‌ షేక్‌ హసీనా, కొమ్ము విజయరాజు చేరారు. ఎంపి కేశినేని శ్రీనివాసరావు (నాని), నందిగామ ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌ పాల్గన్నారు. పెనమలూరు నియోజకవర్గ టిడిపి నేతలు దేవినేని గౌతమ్‌, చలసాని పండు కుమార్తె చలసాని స్మిత, బిసివై పార్టీ నుంచి కె.ఉమావల్లియాదవ్‌, మాదిగ హక్కుల కమిటీ పౌండర్‌ గురివిందపల్లి చిట్టిబాబులు వైసిపిలో చేరారు. వీరిని మంత్రి జోగి రమేష్‌ ఆహ్వానించారు.వైసిపి శ్రేణుల సందడికేసరపల్లి నుంచి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు గన్నవరంలో వేలాది మంది ఘనస్వాగతం పలికారు. యువకులు, మహిళలు సందడి చేశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ వల్లభనేని వంశీమోహన్‌ ఆధ్వర్యంలో గన్నవరం, ఉంగుటూరు మండలాల నుంచి వాహనాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున గన్నవరం తరలించారు. గాంధీ బమ్మ సెంటర్లో జన సందోహం కనిపించిది. ఉదయం 9.30 గంటలకు బస్సు యాత్ర ప్రారంభమవుతుందని ప్రకటించినా 11గంటలకు జగన్‌ బస్సు యాత్రను ప్రారంభించారు. దుర్గాపురం, కొత్తపేట సెంటర్లలో రోడ్డుకు ఇరువైపులా జనాలు నిలబడి సందడి చేశారు. వంశీ కార్యాలయం వద్ద వందలాదిమంది జెండాలు చేతబూని నినాదాలు చేశారు. అక్కడ నుంచి గాంధీ బమ్మ సెంటర్‌ వరకు అడుగడుగునా జనం జేజేలు పలికారు. రోడ్డుకి నాలుగు వైపులా ఉన్న జనాన్ని చూసి అభివాదం చేసేందుకు జగన్‌ బస్సు పైన చుట్టూ తిరిగారు. వంశీ జనాన్ని చూపించారు.నియోజకవర్గంలో జాతీయ రహదారి వెంబడి ఉన్న చిన్న అవుటపల్లి, పెద అవుటపల్లి, తేలప్రోలు, జంక్షన్‌ గ్రామాల్లో కొనసాగిన బస్సు యాత్రలోని సన్నివేశాలే ఇందుకు నిదర్శనం. యాత్రలో ఆద్యంతం ప్రజల నుంచి స్వాగతం లభించడంతో పాటు, మండుటెండను సైతం లెక్క చేయకుండా ముసలిముతక, మహిళలు, యువత బ్రహ్మరథం పట్టారు. మందుబాబులు రోడ్లపై చిందులు తొక్కారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో కేసరపల్లి శిబిరం నుంచి యాత్రను ప్రారంభించారు. గన్నవరంలో వంశీ కార్యాలయం వద్ద భారీ గజమాలతో స్వాగతం పలికారు. గన్నవరం,ఉంగుటూరు, విజయవాడ రూరల్‌ మండలాల గ్రామాలోని ప్రజలు గన్నవరం గాంధీ బమ్మ సెంటర్లో రోడ్డు మీదకు చేరుకున్నారు. దీంతో ప్రతి పాయింట్‌ వద్ద సీఎం జగన్‌ బస్సు పై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. వేల మంది జనం జాతీయ రహదారి మీదకు చేరుకునిజేజేలు పలికారు. డీజే సిస్టం వద్ద పాటలకు కుర్రోళ్ళు డాన్సులు వేశారు. జక్కుల నెక్కలం గ్రామానికి చెందిన యువతులు సెంటర్లో డాన్స్‌ చేస్తూ అందరినీ అలరించారు. షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 9.30 గంటలకు గన్నవరం చేరుకోవాల్సి ఉండగా 11 గంటలు దాటాక చేరుకున్నారు. 12 గంటలకు చిన అవుటపల్లి బస్సు యాత్ర చేరింది. అక్కడ జగన్‌ బస్సు దిగి ఓ వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరించారు. ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున జనాలు కదిలి వచ్చి రోడ్లపై బారులు తీరడంతో ఉదయం నుంచే నిర్దేశించిన షెడ్యూల్‌ కంటే చాలా ఆలస్యంగా యాత్ర కొనసాగింది. అయినప్పటికీ ప్రజలు ఏ మాత్రం విసిగి పోకుండా ఓపికతో వేచిచూశారు. పోలీసులు భారీ బందోబస్తు చేశారు. రోప్‌ పార్టీ జనాన్ని పక్కకు జరిపేందుకు నానా తండాలు పడ్డారు.

➡️