ప్రజా ప్రతినిధులు, అధికారులు సమిష్టి కృషితో పని చేద్దాం : ఎం.శ్రీభరత్

Oct 2,2024 08:56 #TDP Minister, #Visakha

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ చేపడుతున్న ప్రాజెక్ట్ లు, అభివృద్ధి పనులు శాశ్వత పద్దతిన ప్రణాలికా యుతంగా వుండాలని, ప్రజా ప్రతినిధులు అధికారులు సమిష్టిగా పనిచేయాలని విశాఖ పార్లమెంటు సభ్యులు ఎం.శ్రీభరత్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ప్రభుత్వ అతిధి గృహంలో జివిఎంసి అభివృద్ధి పనులపై విశాఖ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు, పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు), సి.హెచ్. వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణు కుమార్ రాజు, పల్లా శ్రీనివాస రావు, పంచకర్ల రమేష్ బాబు, శాసన మండలి సభ్యులు దువ్వారపు రామరావు, వేపాడ చిరంజీవి రావు, ఎపిఎఫ్ఐడిసి చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, జివిఎంసి టిడిపి ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస రావు, టిడిపి జిల్లా అద్యక్షులు గండి బాబ్జి, జివిఎంసి కమిషనర్ డాక్టర్ పి.సంపత్ కుమార్ ఇతర అధికారులతో సమీక్షించారు.
ఈ సమావేశంలో ముందుగా జివిఎంసి కమిషనర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జివిఎంసి అభివృద్ధి కార్యక్రమాలపై వివరిస్తూ జివిఎంసి ఆదాయము, ఖర్చు, సిబ్బంది, రోడ్లు, అభివృద్ధి, వీధిలైట్లు, 24 గంటలు తాగునీరు సరఫరా ప్రణాళిక, కొండవాల ప్రాంతాల అభివృద్ధి, క్రీడ మైదానాలు అభివృద్ధి, 15వ ఆర్థిక సంఘం అమృత-20 నిధులతో అభివృద్ధి పనులు, తాగునీటి సరఫరా, కాలుష్య నియంత్రణ చర్యలు, భూగర్భ మురుగునీటిపారుదల వ్యవస్థ, ఆర్థిక విభాగం బలోపేతం తదితర వాటిపై వివరిస్తూ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, ప్రజా ఆరోగ్య విభాగము, యుసిడి విభాగం, మొక్కల విభాగం తదితర విభాగాలు చేపడుతున్న అభివృద్ధి పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజా ప్రతినిధులకు తెలిపారు.
ఈ సందర్భంగా విశాఖ పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జివిఎంసి అధికారులు ముందస్తు ప్రణాళికతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నగరంలో ప్రధానంగా తాగునీరు, వీధి దీపాలు, కొండవాలు ప్రాంతాలు, రోడ్లు, కాలువలు, పార్కుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, క్రీడలు, ఆక్రమణలు మొదలైన వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. తాగునీరు ప్రతి కుటుంబానికి అందేలా చర్యలు చేపట్టాలని నగరమంతా తాగునీరు కేవలం 30 నిమిషాలు మాత్రమే కొన్ని చోట్ల ఇస్తున్నారని ఆ సమస్య లేకుండా నగరమంతా 24/7 తాగునీరు సరఫరా చేసే విధంగా ఆచరణలోనికి తీసుకురావాలని, అందుకు కావలసిన వనరులు ఇప్పటినుండే సమీకరించుకోవాలని కమీషనర్ కు ఆదేశించారు. వీధి దీపాల నిర్వహణ సమస్య అధికంగా ఉన్నందున నగరములో ప్రతి దీపం వెలిగేలా అందుకు తగ్గట్టుగా గుర్తించిన 157 బ్లాక్ స్పాట్లలో ఖచ్చితంగా లైట్లు త్వరితగతిన అమర్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో కొండవాలు ప్రాంతాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రక్షణ గోడలు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వ సహాయము తీసుకుంటామని, విపత్తులు సంభవించినప్పుడు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా రిటర్నింగ్ వాల్స్ నిర్మాణం తదితర పనులు చేపట్టేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. విశాఖ నగరం క్రీడలకు ఎంతో అనుకూలమైనదని అందుకు కావలసిన వనరులు నగరంలో ఉన్నందున “ఖేలో ఇండియా” నుండి కావలసిన సహకారాన్ని కేంద్రం నుండి అందించేందుకు మేము కృషి చేస్తామని ఆయన తెలిపారు. విశాఖ నగరం పరిధి పెరుగుతున్నందున గత 20 సంవత్సరాల నుండి ఎన్నో గెడ్డలు ఆక్రమణకు గురయ్యాయని వాటిని నిరోధించేందుకు పట్టణ ప్రణాళిక అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. 2026 తర్వాత నగరంలో మురుగునీరు సముద్రంలో కలగకుండా చర్యలు చేపట్టి అందుకు కావలసిన ట్రీట్మెంట్ ప్లాంట్లను అభివృద్ధి చేసుకోవాలని, దోమల నియంత్రణ చర్యలు చేపట్టి ప్రజల ఆరోగ్య రక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. వీధి వ్యాపారస్తులను ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా వారిని నియంత్రించాలని, ఫుడ్ కోర్ట్ పై వస్తున్న ఆరోపణను సమగ్ర విచారణ చేపట్టాలని, దువ్వాడలో ఐటి హిల్స్, ఆర్కే బీచ్ తదితర ప్రాంతాలలో 24 గంటలు ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, నగరంలో పారిశుద్ధ్య కార్మికుల కొరత ఉన్నందున పొరుగు సేవల ద్వారా ఉద్యోగ నియమాకాలను చేపట్టేందుకు ప్రభుత్వానికి నివేదించాలని, గ్రామ కంఠాలలో ఉన్న గృహాలకు ఆస్తి పన్ను విధింపు మార్గాలను అన్వేషించాలని, నగరంలో ట్రాఫిక్ కు అంతరాయమున్న ఆక్రమణ బడ్డీలను తొలగించాలని, నిర్ణీత సమయంలో బిల్డింగ్ ప్లానుల మంజూరుకు చర్యలు చేపట్టాలన్నారు. నగరంలో జివిఎంసి స్థలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని పేదలకు గృహ సముదాయం నిర్మించి ఇచ్చేందుకు ఉపయోగపడతాయన్నారు. నగరంలో రూప్ టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలని అలాగే ఒక లక్ష ఇళ్లకు ప్రభుత్వ సబ్సిడీతో సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇది మంచి ప్రభుత్వమని ఈ ఐదు సంవత్సరాల్లో సమిష్టిగా కృషి చేసి విశాఖ నగర అభివృద్ధికి తోడ్పడుదామని, జివిఎంసి ముఖ్యమైన అత్యవసరమైన ప్రాజెక్ట్ పనులపై నివేదికను సిద్దం చేసినట్లయితే సిఎస్ఆర్ నిధులు సమకూరుస్తామని కమీషనర్ కు పార్లమెంటు సభ్యులు తెలిపారు.
అనంతరం పలువురు శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు జివిఎంసి అభివృద్ధి పనులపై చర్చించి పరిష్కార మార్గ దిశగా చర్యలను చేపట్టాలని కమీషనర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి అదనపు కమీషనర్ లు, ఇంజనీర్లు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

➡️