టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అబద్ధాలు, అసత్యాలే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అజెండా అని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. జగన్ హయాంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన నడిపించలేదన్నారు. టిడిపి కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాతీర్పును అపహస్యం చేసేలా అసెంబ్లీకి రానని అంటున్నారని తెలిపారు. నిజమైన ప్రజానాయకుడు ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాలని చెప్పారు. అసెంబ్లీకి రాకుండా మీడియా ముఖంగానే మాట్లాడతానని చెప్పటం ప్రజాతీర్పును అగౌరవపరచడమేనని అన్నారు.
అప్పులతో జగన్ ఏం చేశారు : మంత్రి సంధ్యారాణి
ఎన్నికల కోడ్ సమయంలో తెచ్చిన అప్పులను వైఎస్ జగన్ ఏం చేశారని గిరిజనశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మరో సమావేశంలో ప్రశ్నించారు. జగన్ తన పాలనలో రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టి రూ.8 లక్షల కోట్ల రాష్ట్ర సంపదను దోచుకున్నారని విమర్శించారు. వైసిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై సభలో చర్చించకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సంధ్యారాణి, పల్లా శ్రీనివాస్ కలిసి టిడిపి కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజల వినతులను స్వీకరించారు.