- సమ్మె విరమించిన కార్మికులు
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఎపి పేపరు మిల్లు యాజమాన్యం ప్రకటించిన లాకౌట్‌ను బుధవారం ఎత్తివేసింది. దీంతో కార్మికులు సోమవారం అర్ధరాత్రి నుంచి సమ్మెను విరమించాయి. అధికార యంత్రాంగం, యాజమాన్య ప్రతినిధులతో జరిపిన చర్చలు సఫలం కావడంతో యాజమాన్యం లాకౌట్ ఎత్తివేసేందుకు అంగీకరించింది. మంగళవారం ఉదయం నుంచి కార్మికులు యథావిధిగా తమ విధులకు హాజరయ్యారు. వేతన ఒప్పందం, ఇతర సంక్షేమ సంబంధిత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎపి పేపరు మిల్లులో కొంతకాలంగా 11 కార్మిక సంఘాలు దశల వారీగా ఆందోళనలు చేస్తున్నాయి. తాజాగా డిసెంబరు 24న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, కార్మిక సంఘాలు ప్రతినిధులు కలిసి యాజమాన్య ప్రతినిధులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నెల 2వ తేదీ నుంచి కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. 11 సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు సమ్మె చేపట్టాయి. ఈ నేపథ్యంలో యాజమాన్యం సోమవారం ఉదయం లాకౌట్ ప్రకటించింది. దీంతో కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. ఆందోళనకు దిగాయి. జెసి ఎస్ చిన్నరాముడు, కార్మిక శాఖ అధికారి రాణి యాజమాన్య ప్రతినిధులతో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకూ దశల వారీగా చర్చలు జరిపారు. హైలెవెల్ కమిటీతో యాజమాన్యం, కార్మిక సంఘాలు కలిసి చర్చించుకుని వారి సూచనల మేరకు 1.7.2020 నుంచి 31.12.2023 వరకూ సంబంధించిన వేతన ఒప్పందం సానుకూలంగా చేసుకునేందుకు ఉభయులూ అంగీకరించారు. ఈ వివాదం లేబర్ కోర్టుకు రిఫర్ చేసినందును యాజమాన్యం, కార్మిక సంఘాలు వేతన సవరణ చర్చల అనంతరం కేసును ఉపసంహరించేందుకు అంగీకారం కుదిరింది. సమ్మెలో పాల్గొన్న వారిపై ఎటువంటి కక్ష పూరిత చర్యలు ఉండబోవని స్పష్టం చేశారు. ఈ చర్చల కాలంలో ఎటువంటి సమ్మెలు, ఆందోళనలు యాజమాన్యం ఎటువంటి లాకౌట్లు ప్రకటించకూడదని ప్రతిపాదించారు.
సిఐటియు, ఎస్‌డబ్ల్యుడబ్ల్యుఎ అభ్యంతరం
యాజమాన్యం ప్రతిపాదనను సిఐటియు, ఎస్‌డబ్ల్యుడబ్ల్యుఎ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశం ఎప్పటికి నిర్వహిస్తుందో గడువును తెలపాలని, ఈ విషయాన్ని మినిట్స్‌లో పొందుపరచాలని కోరారు. దీనిపై స్పష్టత ఇవ్వలేదని, చర్చల కాలంలో ఎటువంటి సమ్మెలు, ఆందోళనను నిర్వహించరాదని యాజమాన్యం ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.