Liquor shops – ఏపీలో రానున్న 10 రోజులూ మద్యం దుకాణాలు బంద్‌

అమరావతి : దసరా పండుగ వేళ …. రానున్న 10 రోజులపాటు ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. మందుబాబుకు ఇది క్లిష్ట సమయమేనని చెప్పాలి..! అక్టోబర్‌ 12వ తేదీ నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీని ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం విదితమే. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతోపాటు కాంట్రాక్ట్‌ ఉద్యోగుల గడువు సెప్టెంబర్‌ 30తో ముగిసింది. మరో 10 రోజుల్లో నూతన మద్యం పాలసీ అమల్లోకి వస్తుండటంతో… ఇక ఉద్యోగాలు ఉండబోవని కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే తాము రోడ్డునపడతామంటూ నిరసనలకు దిగుతున్నారు. ఈనెల 12 నుంచి రాష్ట్రంలో నూతన ఎక్సైజ్‌ పాలసీ అమల్లోకి రానుంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అందుకు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈనెల 9 వరకు ప్రైవేట్‌ మద్యం షాపుల కోసం అప్లికేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 11వ తేదీన 3,396 షాపులకు లాటరీ తీసి 12 నుంచి లైసెన్స్‌ పొందినవారికి ఏరియాల వారీగా షాపులను కేటాయించనున్నారు. ఈ షాపుల కేటాయింపు కోసం దరఖాస్తుదారుల నుంచి రూ.2 లక్షల రుసుముగా నిర్ణయించారు. ఒకవేళ లాటరీలో షాపు దక్కకపోతే ఆ డబ్బు తిరిగి వెనక్కి ఇవ్వబడదు అని స్పష్టం చేశారు. జనాభాను బట్టి లైసెన్స్‌ ఫీజులు నాలుగు శ్లాబులుగా అధికారులు నిర్ణయించారు. 10 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్‌ ఫీజు రూ.50 లక్షలు, 10 వేల నుంచి 50 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్‌ ఫీజు రూ.65 లక్షలు, రూ.5 లక్షల ఆదాయం దాటిన నగరాల్లో గరిష్ట రుసుము రూ.85 లక్షలుగా నిర్ణయించారు. మొత్తం రుసుము ఆరు విడతలుగా చెల్లించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో అప్లికేషన్లు పెట్టుకునేవారు అందుకు ఏర్పాట్లు చేసుకుంటుంటే … ఉద్యోగాలు పోతాయని ఆందోళనలో కాంట్రాక్టు ఉద్యోగులు నిరసనల బాటపట్టారు.

➡️