తుది దశకు చేరిన కసరత్తు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల జాబితాను నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రభుత్వం ఇప్పటికి రెండు జాబితాలు ప్రకటించగా, తాజాగా ప్రకటించనున్న మూడో జాబితా జంబోజెట్ తరహాలో అత్యధిక ఛైర్మన్ పోస్టులను భర్తీ చేసే విధంగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికి భర్తీ చేయని కుల సంఘాల ఛైర్మన్లు, దేవాలయాల పాలకమండళ్ల ఛైర్మన్లు, సభ్యుల నియామకాలకు కూడా జాబితాలో స్ధానం కల్పించనున్నట్లు తెలిసింది. నియోజకవర్గాల స్థాయిలో మార్కెట్ కమిటీలకు ఈ నెలాఖరులోగా జాబితాను ఫైనల్ చేసే అవకాశముంది. ఒక వేళ అనుకోని కారణాలతో ఆలస్యమైతే ముక్కోటి సందర్భంగా జనవరి 9న జాబితా ప్రకటించే అవకాశమున్నట్లు తెలిసింది. ఈ సారి జాబితాలో మార్కెట్ కమిటీలు, సహకార సంస్థలు, రాష్ట్ర సహకార బ్యాంకు పాలక మండళ్లు, మత్స్యకార సొసైటీలు, ఆప్కాబ్ ఛైర్మన్ లాంటి పదవులు కూడా ఉంటాయని సమాచారం. జిల్లాస్థాయి, నియోజకవర్గ స్థాయి పదవులను ఆయా ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు సిఫారసు చేసిన వారికి కట్టబెట్టే యోచనలో కూటమి పార్టీ అగ్రనేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గ పోస్టుల్లో 34 శాతం బిసిలకు కట్టబెట్టనున్నట్లు తెలిసింది.
