CPM: నవంబర్‌ 1 నుంచి 7 వరకు ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రజాహోరు

  • 8న కలెక్టరేట్లు, మండల కార్యాలయాల వద్ద ధర్నాలు
  • ఈ నెల 18న విద్యుత్‌ కార్యాలయాల వద్ద నిరసనలు
  • సిపిఎం రాష్ట్రకమిటీ పిలుపు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అధిక ధరలు, నిరుద్యోగం, మహిళలు- పిల్లలు-దళితులపై అత్యాచారాలు, జమిలి ఎన్నికలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నవంబర్‌ 1 నుంచి 7వ తేది వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజాహోరు’ పేరుతో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించాలని , 8వ తేది జిల్లా కలెక్టరేట్లు, మండల కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.
అక్టోబర్‌ 10,11 తేదిల్లో ఎం.ఏ గఫూర్‌ అధ్యక్షతన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశ నిర్ణయాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌ బాబురావు విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ప్రభుత్వానికి భిన్నమైన పాలన అందిస్తామన్న టిడిపి కూటమి వాగ్ధానం అమల్లోకి రాలేదనిచెప్పారు. గత నెల రోజుల్లోనే ధరలు సామాన్యులకు అందుబాటులో లేని విధంగా ఆకాశానికంటాయని చెప్పారు. దసరా పండగ కొనుగోళ్లలోనూ ధరల ప్రభావం కనిపించింద న్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఉల్లి పాయలు, వంట నూనెలతో సహా ఇతర నిత్యావసర వవస్తువులను సరసమైన ధరలకు అందించాలని డిమాండ్‌ చేశారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూస్తున్న యువత నిరాశకు గురవుతోందని చెప్పారు. అక్టోబర్‌లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించి ఇప్పుడు జనవరికి వాయిదా వేసిందన్నారు. ఎపిపిఎస్‌సికి చైర్మన్‌ లేకపోవడంతో నియామకాలు జరుగుతాయో, లేదోనన్న ఆందోళన నిరుద్యోగుల్లో నెలకొందని అన్నారు. కోచింగ్‌లు తీసుకున్న యువత అమోయమంలో ఉందని, వెంటనే రిక్రూట్‌మెంట్‌ ప్రారంభించి, ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పిపిపి పేరుతో మెడికల్‌ కళాశాలలను ప్రైవేటు పరం చేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.
ఉచిత ఇసుక పేరు చెప్పి గతం కంటే రెట్టింపు ధర చేశారని పేర్కొన్నారు. ఉచిత ఇసుక అంటూనే ప్రైవేటు వారికి, అధికారంలో ఉన్న వారి అనుయాయులక రీచ్‌లు అప్పగించడం దారుణమని చెప్పారు. ‘ఇది ఒక రకంగా మాఫియా. పాత ఎంఎల్‌ఏ పోయి కొత్త ఎంఎల్‌ఏ వచ్చారు. పాత ముఖం స్థానంలో కొత్త ముఖం..అంతే’ అని అన్నారు. ఉచిత ఇసుకకు జిఎస్టి పేరుతో టెండర్లు పిలవడం ఏమిటో అర్ధం కావడం లేదన్నారు.రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై ఆత్యాచారాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆచూకి కనపడని ఆడపిల్లల సంఖ్య పెరుగుతుందని పేర్కొన్నారు. మద్యం బెల్ట్‌ షాపులకు ఎమ్మెల్యేలు అనధికారికంగా వేలం నిర్వహిస్తున్నారని చెప్పారు.అవినీతి విచ్చలవిడిగా సాగుతోందన్నారు. గత ప్రభుత్వానికి ఇప్పుటికి తేడా ఏమిటనే ప్రశ్న ప్రజల్లో మొదలైందన్నారు.ఉపాధ్యాయులు, ఉద్యోగుల పై గత ప్రభుత్వం లానే ఈ ప్రభుత్వంలో కూడా వేధింపులు ఉన్నాయని చెప్పారు. జమిలి ఎన్నికలు రాష్ట్రాల హక్కులను దెబ్బతీస్తాయని, ప్రజాస్వామ్యా నికి విఘాతం కలుగుతుందని అన్నారు. దీనిని టిడిపి ప్రభుత్వం బలపరచడం గర్హనీయమని అన్నారు.
విశాఖస్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ విషయంలో ముఖ్యమంత్రి స్పందన సంతృప్తికరంగా లేదన్నారు. ప్రైవేటీకరణ జరగదనే విశ్వాసం ప్రజల్లో కలిగించలేకపోయారని, ఇంకా మార్గాలను అన్వేషిస్తున్నామంటూ నాన్చుడు ధోరణితో ఉన్నారన్నారు. ప్రైవేటీకరణ చేయకుండా ఉండటానికి కార్మిక యూనియన్లు అనేక మార్గాలు చెబుతున్నా యని వారితో చర్చలు జరిపి, కేంద్రం కుట్రను తిప్పి కొట్టాలన్నారు. పోలవరం,రాజధాని నిధులపై ఒక్కొసారి ఒక్కొ విధంగా రాష్ట్ర పభుత్వం మాట్లాడుతుందని చెప్పారు. ప్రపంచ బ్యాంకు నిధులు ఇస్తుందని చెబుతున్నారని, వీటిని కేంద్రం భరిస్తుందా? రాష్ట్రం తీరుస్తుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.
వరద సాయం అస్తవ్యస్తంగా ఉందని, అన్నింటినీ సరిదిద్ది నష్టపోయిన బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికీ పెద్ద సంఖ్యలో బాధితులకు సహాయం అందలేదని చెప్పారు. కౌలు రైతులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. వెంటనే సమగ్ర సర్వే చేసి అందరికీ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రం నుండి ఇంతవరకు ఎలాంటి సహాయం అందకపోవడం దుర్మార్గమని అన్నారు. చేయని కేంద్ర సహాయాన్ని భూతద్దంలో చూపెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు మభ్యపెట్టడం అన్యాయమన్నారు. రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత వైఖరిని ఖండించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ట్రూ అప్‌ రద్దు చేయాలి: బాబూరావు
విద్యుత్‌ వినియోగదారులపై ఇంధన సర్దుబాటు, ట్రూఅప్‌ ఛార్జీలను రద్దు చేయాలని సిహెచ్‌ బాబూరావు డిమాండ్‌ చేశారు. వైసిపి ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలను భారీగా పెంచిందని బాదుడే బాదుడు పేరుతో ప్రతిపక్షంలో ఉండగా టిడిపి విమర్శించిందని చెప్పారు. వైఎస్‌ జగన్‌ బాదుడు పోయి ఇప్పుడు కూటమి ఉమ్మడిగా బాదుడు మొదలు పెట్టిందని విమర్శించారు. ట్రూఅప్‌, సర్దుబాటు పేరుతో రూ.20వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేయడాన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. ఎప్పుడో వాడిన విద్యుత్‌కు అప్పుడే బిల్లులు చెల్లించినా, ఇప్పుడు మళ్లీ కట్టాల్సిందేనన్న ట్రూ అప్‌ ఛార్జీల పద్దతిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వ హయంలో మోపిన ఈ ట్రూ అప్‌ ఛార్జీలను ఉపసంహరించుకుంటూ రెగ్యులేటరీ కమిషన్‌కు తెలియచేయాలని కోరారు. ఈ నెల 18వ తేదిన జరిగే బహిరంగ విచారణలో ప్రజల తరపున తమ అభిప్రాయాలు తెలియజేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ కార్యాలయాల వద్ద అదే రోజు ధర్నాలు నిర్వహించాలని కోరారు.

➡️