మోడీ పాలనలో స్వచ్ఛమైన అవినీతి

  • అదానీ కుంభకోణమే నిదర్శనం శ్రీచంద్రబాబు మౌనం ఎందుకు?
  • సెకీ ఒప్పందం కొనసాగించడమంటే జగన్‌ను సమర్థించినట్లే
  • అదానీ కుంభకోణంపై పార్లమెంటులో ప్రకటన చేయాలి
  • విశాఖ స్టీలు ప్రైవేటీకరించబోమని ప్రధాని ప్రకటించాలి
  • సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ బేబి, బి.వి.రాఘవులు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ప్రధాని మోడీ పాలనలో దేశంలో స్వచ్ఛమైన అవినీతి జరుగుతోందని, అదానీ కుంభకోణమే దీనికి నిదర్శనమని, అవినీతి వ్యవహారంపై పార్లమెంటులో స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఏం.ఏ.బేబీ, బి.వి.రాఘవులు అన్నారు. విజయవాడలో రెండు రోజులపాటు జరిగిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో వారు పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్వహించాల్సిన పోరాటాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. వీటికి సంబంధించిన వివరాలను బాలోత్సవ్‌ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతో కలిసి వారు వివరించారు. అదానీతో ఒప్పందానికి సంబంధించి జగన్‌మోహన్‌రెడ్డి తేలుకుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఈ ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రజలపై లక్షకోట్ల భారం పడుతుందని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉండగా దీనిపై విమర్శలు చేసిన టిడిపి నాయకులు ఇప్పుడు నోరెత్తడం లేదని విమర్శించారు. ఒప్పందంలో రూ.2029 కోట్ల అవినీతి ఉందని, అందులో రూ.1757 కోట్లు జగన్‌కు అందినట్లు, అమెరికా న్యాయవిభాగం తేల్చిందని, అటువంటప్పుడు ఒప్పందంలో ఏముందో వివరించేలా పత్రాలను బయటపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. రూ.1.99 పైసలకు వచ్చే విద్యుత్‌ను రూ.2.49 పైసలకు ఎందుకు కొన్నారో బయటపెట్టాలన్నారు. ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకోవాలన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఆ పనిచేయకపోతే ఈ విషయంలో జగన్‌మోహన్‌రెడ్డిని సమర్థించినట్లే భావించాల్సి ఉంటుందని తెలిపారు. దేశంలోనే ఇది అతిపెద్ద రాజకీయ కుంభకోణమని చెప్పారు. అవినీతిలేని రాజకీయాలు చేస్తానని చెబుతున్న మోడీ, జగన్‌ ఇద్దరూ మంచి స్నేహితులని పేర్కొన్నారు. అందువల్లే కేంద్రంలోనూ దీనిపై చర్చ చేయడం లేదని, కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టిడిపి కూడా ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కుంభకోణం నేపథ్యంలో అదానీ పేరు చెప్పేందుకు కూడా సాహసించ లేదని పేర్కొన్నారు. కేజ్రీవాల్‌, సోరేన్లను చిన్నచిన్న కేసుల్లో అరెస్టులు చేశారని, అమెరికా న్యాయ విభాగం కేసు నమోదు చేసినా జగన్‌పై కనీస విచారణకు సిద్ధపడటం లేదని తెలిపారు. ఈడి, సిబిఐ ఎందుకు దీనిపై విచారించడం లేదో కేంద్రం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. జగన్‌ను విచారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంత పెద్ద కుంభకోణం జరిగిందని కేసు నమోదైనా చంద్రబాబు ఎందుకు మౌనం వహిస్తున్నారో తెలపాలన్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ మౌనం వీడి జగన్‌పై చర్య తీసుకోవాలని కోరారు.

మిట్టల్‌ స్టీలు రాయలసీమలో పెట్టాలి

అనకాపల్లి పరిధిలో అర్సెల్లర్‌ మిట్టల్‌ స్టీలు ప్లాంటు ఏర్పాటు చేయాలనో ఆలోచన వెనుక విశాఖ స్టీలు ప్లాంటును నాశనం చేయాలనే కుట్ర ఉందని రాఘవులు విమర్శించారు. ఇప్పటికే ఉన్న ప్లాంటు పరిధిలో కొత్త ప్లాంటు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలపాలని డిమాండు చేశారు. దీనివెనుక కేంద్రం కుట్ర దాగుందని, దానికి చంద్రబాబు వంతపాడుతున్నారని అన్నారు. కేంద్రం ప్రైవేటీకరణదిశగా చకచకా ముందుకు వెళుతుంటే రాష్ట్రం మాత్రం చేయనీయబోమని చెప్పడం ఏమిటో అర్థం కావడం లేదని తెలిపారు. రాష్ట్రం చెప్పింది నిజమనుకోవాలంటే విశాఖ స్టీలును ప్రైవేటీకరించడం లేదని ప్రధానితో ప్రకటన చేయించాలని అన్నారు. పార్లమెంటులో టిడిపి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పట్టుబడితే కేంద్రం దిగొస్తుందని, ఈ సమావేశాల్లో రెండు పార్టీలూ చిత్తశుద్ధి ఉంటే ఆ పనిచేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఆర్సెల్లార్‌ మిట్టల్‌ స్టీలు ప్లాంటును రాయలసీమ పరిధిలో ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టుకు దగ్గర్లో ఏర్పాటు చేయవచ్చని తెలిపారు. ఇప్పటికే కడప స్టీలు ప్లాంటుకు అనుమతి ఉన్న నేపథ్యంలో అక్కడ పెట్టే ఆలోచన చేయాలని సూచించారు.

రాష్ట్రాల హక్కులపై దాడి

గతంలో పూర్తి బలంతో అధికారంలో ఉన్న బిజెపి దాన్ని వ్యతిరేకించే రాష్ట్రాల హక్కులపై తీవ్ర దాడి చేసిందని, ప్రస్తుతం అంత బలం లేకపోయినా అదే ఒరవడి కొనసాగిస్తోందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఏం.ఏ.బేబీ అన్నారు. ఎపిలో జరిగిన అవినీతి వ్యవహారాలపై మోడిగానీ, విచారణ ఏజెన్సీలు గానీ కనీసం ప్రస్తావించలేదన్నారు. సాగర్‌ అదానీపై అమెరికాలో కేసు నమోదైనా ఇక్కడ ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ అవినీతి ప్రభావం ప్రజలపై తీవ్రంగా ఉంటుందని, భవిష్యత్‌లో విపరీతమైన భారాలు పడతాయని పేర్కొన్నారు. మణిపూర్‌లో హింసను ఆపేందుకు మోడీ ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని, పైగా దాడులకు మోడీ, అమిత్‌షా ప్రోత్సాహం ఇస్తున్నారని తెలిపారు. అక్కడ ముఖ్యమంత్రిని కాపాడుతున్నారని తెలిపారు. బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అరాచకం చేస్తూ వ్యతిరేకించే రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని తెలిపారు. ఇప్పటికే బిజెపి తీరును వ్యతిరేకిస్తూ కేరళ, బెంగుళూరులో సమావేశాలు జరిగాయని గుర్తు చేశారు. కేరళలో వయనాడ్‌ విపత్తు జరిగితే కేంద్రం నుండి రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.

వక్ఫ్‌ సవరణను వ్యతిరేకిస్తున్నాం

వక్ఫ్‌ చట్టానికి సవరణలు చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వక్ఫ్‌లో బిజెపి అనుకూలురును పెట్టి దెబ్బతీసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, ఇటువంటి అనాగరికమైన నిర్ణయాలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఈ తరహా నిర్ణయాలను వెనక్కు తీసుకునేలా టిడిపి, జనసేన కూడా పార్లమెంటులో పోరాడాలని కోరారు. అదానీ రాష్ట్రానికి వచ్చిన సమయంలోనే సిపిఎం గా తాము వ్యతిరేకించామని శ్రీనివాసరావు వెల్లడించారు. అప్పట్లో ఆయనతో జరిగిన ఒప్పందాలు బయటపెట్టాలనీ డిమాండ్‌ చేశామని, ప్రభుత్వం మిన్నకుండిపోయిందని తెలిపారు. నాడు టిడిపి కూడా మాట్లాడలేదన్నారు. ఈ ఒప్పందంలో అవినీతి జరిగిన విషయం తమ దృష్టిలో ఉందని అసెంబ్లీలో చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని, లేనిపక్షంలో అవినీతిని చంద్రబాబు కూడా సమర్థించినట్లు భావించాల్సి వస్తుందని తెలిపారు. ప్రజలపై భారీగా ట్రూఅప్‌ భారం పడుతోందని, చిత్తశుద్ధి ఉంటే ఒప్పందంతోపాటు, ట్రూఅప్‌ భారాలను కూడా టిడిపి కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని శ్రీనివాసరావు డిమాండు చేశారు.

➡️