ప్రజాశక్తి – గన్నవరం (కృష్ణా జిల్లా) : విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టుకు గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల పరిధిలో అవసరమైన స్థలాలను శుక్రవారం వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. గుడివాడ ఆర్‌డిఒ సుబ్రహ్మణ్యం, రెవెన్యూ అధికారులతో కలిసి విజయవాడ మెట్రో చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ జి.వి.రంగారావు… గన్నవరం, కేసరపల్లిలో పర్యటించారు. గన్నవరం బస్టాండ్, ప్రభుత్వాస్పత్రి, హెచ్‌సిఎల్, కేసరపల్లి సెంటర్, విమానాశ్రయం ప్రాంతాల్లో మెట్రో స్టేషన్ ఏర్పాటుకు అవసరమైన స్థలాలను పరిశీలించారు. హెచ్‌సిఎల్, కేసరపల్లిలో 12:42 మీటర్ల నిష్పత్తితో నిర్మించనున్న మెట్రోస్టేషన్లకు అవసరమైన భూసేకరణపై సమాలోచనలు చేశారు. ప్రాజెక్టు మొదటి కారిడార్‌లో 26 కిలోమీటర్లు మేర మెట్రో నిర్మాణాన్ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కారిడార్ విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం వరకు ఉంటుంది. ఈ సందర్భంగా గుడివాడ ఆర్‌డిఒ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ… గన్నవరం బస్టాండ్ వద్ద మెట్రో ప్రాజెక్టు ప్రారంభమై హెచ్‌సిఎల్ కంపెనీ మీదుగా విమానాశ్రయంలోకి వెళుతుందన్నారు. అక్కడ నుండి కేసరపల్లి, గూడవల్లి, నిడమానూరు, ప్రసాదంపాడు, రామవరప్పాడు గ్రామాల మీదుగా విజయవాడ వెళుతుందన్నారు. గ్రామాల వారీగా మెట్రోస్టేషన్లు ఉంటాయని తెలిపారు. ముందుగా ప్రభుత్వ స్థలాలను పరిశీలిస్తున్నామని, అవి అందుబాటులో లేకపోతే భూ సేకరణ జరుపుతామని చెప్పారు. మెట్రోకోచ్ డిపోకు 60 ఎకరాలు అవసరం అవుతాయని తెలిపారు. ఇందుకు కేసరపల్లి ప్రాంతంలో స్థల పరిశీలన చేస్తామన్నారు. ప్రభుత్వ భూమిలోనే దీనిని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. మెట్రో స్టేషన్లను జాతీయ రహదారికి 15 మీటర్ల దూరంలో నిర్మించే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. పూర్తిస్థాయిలో పరిశీలన అనంతరం ప్రభుత్వానికి నివేదిక పంపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గన్నవరం తహశీల్దారు వెంకట శివయ్య, విద్యుత్ శాఖ ఎఇ రాజు, ఆర్‌అండ్‌బి ఎఇ, అగ్రికల్చర్ అధికారులు, మండల సర్వేయర్ మాధవరావు, ఆర్‌ఐ రవి తదితరులు పాల్గొన్నారు.
