‘మంచు’ కుటుంబంలో ఆస్తుల లొల్లి

Dec 10,2024 00:34 #assets, #fluctuate, #Manchu family
  • రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించిన మోహన్‌బాబు
  • కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని మనోజ్‌ ఫిర్యాదు

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : సీనియర్‌ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో విభేదాలు తారస్థాయికి చేరాయి. తనకు రక్షణ కల్పించాలని మోహన్‌బాబు, తన కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని మోహన్‌బాబు కుమారుడు మనోజ్‌ వేర్వేరుగా పోలీసులను ఆశ్రయించారు. తన కుమారుడు, నటుడు మనోజ్‌, ఆయన భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని రాచకొండ కమిషనర్‌కు మోహన్‌బాబు సోమవారం ఫిర్యాదు చేశారు. తన ప్రాణానికి, ఆస్తులకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో ఆయన పోలీసులను కోరారు. అసాంఘిక శక్తులుగా మారిన కొందరి నుంచి రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. ‘నేను జల్‌పల్లిలో పదేళ్లుగా నివసిస్తున్నాను. నాలుగు నెలల కిందట నా చిన్న కొడుకు ఇల్లు వదిలి వెళ్లాడు. కొందరు సంఘ వ్యతిరేకులతో కలిసి మనోజ్‌… నా ఇంటి వద్ద కలవరం సృష్టించాడు. మనోజ్‌ తన ఏడు నెలల కుమార్తెను ఇంటి పని మనిషి సంరక్షణలో విడిచిపెట్టాడు. మాదాపూర్‌లోని నా కార్యాలయంలోకి 30 మంది వ్యక్తులు చొరబడి సిబ్బందిని బెదిరించారు. మనోజ్‌, మౌనిక నా ఇంటిని అక్రమంగా ఆక్రమించుకొని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. నా భద్రత, విలువైన వస్తువులు, ఆస్తుల విషయంలో భయపడుతున్నాను. నాకు హాని కలిగించే ఉద్దేశంతో వారున్నారు. నా నివాసాన్ని శాశ్వతంగా ఖాళీ చేయాలని బెదిరించారు. సంఘ విద్రోహులుగా మారి నా ఇంట్లో ఉన్న వారికి ప్రాణహాని కలిగిస్తున్నారు. చట్టవిరుద్ధంగా నా ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు వారిద్దరూ ప్లాన్‌ చేశారు. నేను 70 ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్‌ని. మనోజ్‌, మౌనిక, వారి సహచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నా భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించండి. నా ఇంట్లో ఎలాంటి భయమూ లేకుండా గడిపేందుకు రక్షణ కల్పించండి’ అని మోహన్‌బాబు తన ఫిర్యాదులో కోరారు.

పహాడీషరీఫ్‌ పోలీసు స్టేషన్లో మనోజ్‌ ఫిర్యాదు

తనపై దాడి జరిగిందంటూ నటుడు మంచు మనోజ్‌ సోమవారం పహాడీషరీఫ్‌ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదుతో పాటు తన మెడికల్‌ రిపోర్టునూ అందజేశారు. ఈ వ్యవహారంపై పహాడిషరీఫ్‌ సిఐ గురువారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘ఇంట్లో ఉండగా పదిమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాడి చేశారని మనోజ్‌ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దాడి చేసిన తర్వాత వారంతా పారిపోయారని మనోజ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు, తన కుటుంబం సభ్యులకు ప్రాణహాని ఉందని, దాడి చేసిన వారి వివరాలు మాకు చెప్పలేదు. మనోజ్‌ ఒక్కరికే గాయాలయ్యాయి. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాం. మనోజ్‌పై దాడి చేసిన వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తాం’ అని తెలిపారు.

➡️