హుజూరాబాద్ (జమ్మికుంట) : తమ ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనన్న భయంతో … ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన శనివారం రాత్రి జమ్మికుంట మండలంలో జరిగింది. జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్ రైల్వేస్టేషన్-పాపయ్యపల్లె గేట్ వద్ద శనివారం రాత్రి ఓ యువతి, యువకుడు రైలు కింద పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రేమ వ్యవహారమే వీరి ఆత్మహత్యకు కారణమని రైల్వే పోలీసులు చెప్పారు. ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన మినుగు రాహుల్ (18) ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్రచింతల్ గ్రామానికి చెందిన గోలేటి శ్వేత (20) కరీంనగర్‌లోని ఉమెన్స్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. వీరిద్దరికి సామాజిక మాధ్యమంలో కొద్ది నెలల క్రితం పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ విషయం ఇంట్లో తెలిస్తే అంగీకరించరనే భయంతో ఇద్దరూ కలిసి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
