ప్రజాశక్తి – గాజువాక (విశాఖపట్నం) : మూడంతస్తుల భవనం పైనుంచి దూకి ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖలోని గాజువాక పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఎసిపి త్రినాథరావు తెలిపిన వివరాల ప్రకారం.. అమలాపురం ప్రాంతానికి చెందిన పిల్లి దుర్గారావు (32), నూకల సాయి సుస్మిత (25) గాజువాక వెంకటేశ్వర కాలనీలోని ఓ అపార్టుమెంట్‌లో ఆరు నెలలుగా అద్దెకు ఉంటున్నారు. దుర్గారావు విశాఖలో క్యాటరింగ్ పనులు చేస్తుండగా, సాయి సుస్మిత హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఇద్దరు కలిసి అద్దెకు ఉంటున్న భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని ఎసిపి త్రినాథరావు, సిఐ పార్థసారథి పరిశీలించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని, విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని వారు చెప్పారు.