ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :నైరుతి బంగాళాఖాతంలో బుదవారం అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి శుక్రవారం నాటికి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెలాఖరుకు తుఫాన్‌గా మారే అవకాశం వుందని వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర విపత్తుల నిర్వహణా సంస్థ ఎమ్‌డి రోణంకి కుర్మనాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ బలపడి నైరుతి బంగాళాఖాతానికి అనుకుని వున్న రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు పొరుగున వున్న తమిళనాడుపై ప్రభావం పడనుంది. దీని ప్రభావంతో ఐదు రోజులపాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ ఎత్తు వరకూ ఆవరించింది. ఈ కారణంగా రాష్ట్రంలోని విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు జిల్లా, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్‌టిఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో గురువారం పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం వుందని ప్రజలు అప్రమత్తంగా వుండాలని కోరారు. మంగళవారం అనంతపురం జిల్లా నార్పలలో 26.5 మిల్లీ మీటర్లు, బికె సముద్రంలో 22 మిల్లీ మీటర్లు, చిత్తూరులో 22.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. a
