అమరావతి : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది బుధవారం నాటికి శ్రీలంక-తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో డిసెంబర్ 15 వరకు కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం ప్రభావంతో మంగళవారం రోజున అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో.. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్యలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షాల నేపధ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. కోతకి సిద్దంగా ఉన్న వరి పంటని వర్షాలకు ముందు కోయకూడదన్నారు. ఒకవేళ కోసినా పూర్తిగా ఆరని పనలను వర్షాల నేపధ్యంలో కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25 కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్పవేసుకోవడం వల్ల నష్ట శాతాన్ని నివారించుకోవచ్చని చెప్పారు. కోత కోసి పొలంలో ఉన్న పనలు వర్షానికి తడిస్తే గింజ మొలకెత్తకుండా ఉండడానికి 5 శాతం ఉప్పు ద్రావణాన్ని పనలపై పడేవిధంగా పిచికారీ చేయాలన్నారు. రైతులు పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు, చెట్లు పడిపోకుండా నిలబడేందుకు కర్రలు, బాదులతో సపోర్ట్ అందించాలన్నారు. ఏ ప్రాంతంలోనైనా వ్యవసాయ సంబంధిత ఇతర సందేహాలు నివృత్తి కోసం మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు.